YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జవహర్ నగర్ డంప్ యార్డ్ క్యాపింగ్ పనుల్లో ప్రారంభమైన రెండోదశ పనులు పరిశీలించిన దానకిషోర్

జవహర్ నగర్ డంప్ యార్డ్ క్యాపింగ్ పనుల్లో ప్రారంభమైన రెండోదశ పనులు పరిశీలించిన దానకిషోర్
135 ఎకరాల విస్తీర్ణంలో 14మిలియన్ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ క్యాపింగ్ పనులను జీహెచ్ ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నేడు పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద క్యాపింగ్ పనులు రికార్డుగా ఉన్న జవహర్ నగర్ క్యాపింగ్ పనులలో రెండవ దశ జియోసింథటిక్ క్లేలైనర్ వేసేపనులు ప్రారంభమయ్యాయి. ఈ క్యాపింగ్ పనులను ఇ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్చక్రవర్తి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, రిటైర్డ్ సిసిఎఫ్ చటర్జి తదితరులతో కలిసి దానకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాపింగ్ పనుల పురోగతి, చెత్త నుండి విద్యుత్చేసే ప్లాంట్ నిర్మాణం, డంపింగ్ యార్డ్లో ఎరువుల తయారీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, డంప్యార్డ్ నుండి వచ్చే కాలుష్య జలాల (లీచెట్)ను శుద్ది చేయడం, క్యాపింగ్ పనులు, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో ఎదుర్కొనే సమస్యలు తదితర అంశాలపై రాంకి ప్రతినిధి గౌతమ్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్కు వివరించారు.   ఇంతపెద్ద విస్తీర్ణంలో డంప్యార్డ్ క్యాపింగ్ పనులు ఇప్పటి వరకు ఏ నగరంలోనూ చేపట్టలేదు.  625 చ.కి.మీ విస్తర్ణం కలిగిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను మొత్తం జవహర్ నగర్ లో 2002 నుండి వేస్తున్నారు. దీనితో జల, వాయు కాలుష్యాలు ఏర్పడి జవహర్ నగర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని. ఈ విషయమై ఎన్నో సార్లు రోడ్లపై బైటాయించి ఆందోళనలు కూడా చేపట్టారు. జవహర్ నగర్ కాలుష్యంపై కొందరు గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనంతరం ప్రస్తుతం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుండి కాలుష్యం రాకుండా క్యాపింగ్ పనులను చేపట్టాలని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రత్యేక దృష్టి సాధించి చర్యలను చేపట్టారు. దీనితో రూ. 144 కోట్ల వ్యయంతో డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను చేపట్టడానికి 2018 మార్చి మాసంలో అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ క్యాపింగ్ పనుల్లో మొదటి దశ మట్టితో కప్పే ప్రక్రియ పూర్తి అయ్యింది. పరిసర గ్రామాలకు చెందిన చెరువుల నుండి దాదాపు 6వేల టన్నుల బంకమట్టిని డంపింగ్ యార్డ్పై కప్పివేయడంతో ఈ డంపింగ్యార్డ్ నుండి వచ్చే దుర్వాసనలో దాదాపు 90శాతం తగ్గింది. క్యాపింగ్లో రెండవ దశలో బాగంగా మట్టిపొరపై జీయోసింథటిక్ క్లే లైనింగ్ పనులు ప్రారంభించారు. 2019 జూన్ మాసాంతంలోగా మొత్తం క్యాపింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) రంగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మార్గదర్శకత్వం చూపనుంది. ఈ క్యాపింగ్ పనులపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక దృష్టి సాధించడంతో తిరిగి ఈ పనులు ముమ్మరమయ్యాయి. జవహర్ నగర్ డంప్ యార్డ్ క్యాపింగ్ పనులను డంప్ యార్డ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ క్యాపింగ్ పనులను చేపట్టింది. డంపింగ్ యార్డ్ నుండి వెలువడే విషద్రవాలు(లీచెట్)ను, మిథెన్ వాయువును బయటకు తీయడానికి 152 బోరుబావులను వేయాల్సి ఉండగా వంద బోరుబావుల తవ్వకం పూర్తిచేశారు. 300 ఎంఎం వ్యాసార్థం గల పైపులతో కూడిన ఈ బోరుబావుల నుండి లీచెట్, విషవాయువులు ప్రవహింపజేసి వీటిని ఒక కంటైనర్లోకి తరలించి వాటి ద్వారా విద్యుత్ తయారీ, కాలుష్య జలాలను శుద్ది చేయడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. అనంతరం చెత్త ద్వారా ఎరువుల తయారీ యూనిట్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ లీచెట్ శుద్ది మిషన్లు తదితర యూనిట్లను దానకిషోర్ పరిశీలించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తిచేసే 20మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ దసరా వరకు పూర్తి అవుతుందని రాంకి ప్రతినిధులు కమిషనర్కు వివరించారు.

Related Posts