YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దర్శిలో ఎన్నికల @ 150 కోట్లు

దర్శిలో ఎన్నికల @ 150 కోట్లు

ప్రకాశంజిల్లాలో ఆ నియోజకవర్గం చాలా కాస్ట్లీ. అక్కడ గెలవాలంటే ప్రధాన పార్టీలు రెండూ కూడా దాదాపు 150 కోట్లదాకా ఖర్చు చేయాల్సిందే. అటువంటి చోట వైసీపీకి చెందిన బలమైన నేత చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకున్నారు. ప్రకాశం జిల్లాలో దర్శి నియోజయవర్గానికి....రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత ఉంది. దర్శిని అందరూ...చాల కాస్ట్‌లీ నియోజకవర్గంగా పిలుస్తారు.  2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శిద్ధా రాఘవరావు, వైసీపీ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. శివప్రసాద్‌రెడ్డిపై సిద్దా రాఘవరావు విజయం సాధించి...మంత్రి పదవి చేపట్టారు. ఇద్దరు అభ్యర్థులు నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పలు గ్రామాలను దత్తత తీసుకొని మరీ ప్రజలు అడిగిన పనులన్ని చేశారు.వచ్చే ఎన్నికల్లో మంత్రి శిద్దా రాఘవరావును ఎదుర్కోవాలంటే...బూచేపల్లి శివప్రసాద్ రెడ్డే సరైన అభ్యర్థి. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ప్రతి గ్రామంలో మంచి సంబంధాలున్నాయి. తమ వర్గాలను చాలా కాలంగా కాపాడుకుంటూ వస్తోంది బూచేపల్లి కుటుంబం. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ...ఇప్పటికే జగన్‌కు తన అభిప్రాయాన్ని చెప్పారు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి. అప్పటి నుంచి బలమైన అభ్యర్థి కోసం జగన్‌ అన్వేషిస్తున్నారు. ఎవరూ దొరక్కపోవడంతో మళ్లీ బూచేపల్లి శివప్రసాద్‌తోనే చర్చలు జరిపారు జగన్. సర్వేల కూడా ఆయనకే అనుకూలంగా ఉండటంతో.. ఆయనకే టికెట్ ఇవ్వాలని వైసీపీ నేతలు డిసైడ్ అయ్యారు. అయితే తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్య కారణాలతో...రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు శివప్రసాద్‌రెడ్డి. దీంతో బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో చర్చల తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సహకరిస్తానని...శివప్రసాద్‌రెడ్డి జగన్‌ సమక్షంలోనే చెప్పారు. అంతేకాకుండా వారికి తన వర్గం నేతలను పరిచయం చేసి తాను అండగా నిలబడుతానని భరోసా ఇచ్చారు.  వైసీపీ అధిష్టానం తొలుత బాదం మాధవరెడ్డిని పోటీ చేయించాలని భావించింది. అయితే బూచేపల్లి కుటుంబం సపోర్ట్ చేసేది లేదని చెప్పడంతో మాధవరెడ్డి తప్పుకున్నారు. 2014లో వైసీపీ సీటు బూచేపల్లికి కేటాయించడంతో ఆ ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా పని చేశారు మాధవరెడ్డి. ఈ కారణంగానే గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చిందని శివప్రసాద్‌రెడ్డి కుటుంబం గుర్రుగా ఉంది. దీంతో మాధవరెడ్డికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మాధవరెడ్డి సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టడంతో....మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు తెరపైకి వచ్చింది. బూచేపల్లి కుటుంబం ఆశీస్సులు ఉంటేనే...ఎన్నికల బరిలో నిలివాలని వేణుగోపాల్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బాలినేనికి, జగన్‌కు కూడా చెప్పారు. బూచేపల్లితో శ్రీనివాస్‌రెడ్డి చర్చలు జరిపిన తర్వాతే...మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్...ప్రజారాజ్యం తరపున పోటీ చేసి...బూచేపల్లి చేతిలో ఓడిపోయారు. తన వర్గానికి బూచేపల్లి వర్గం తోడయితే...గెలుపు సులభమవుతుందని వేణుగోపాల్ అంచనా వేస్తున్నారు. బూచేపల్లి, మద్దిశెట్టి కలిసి పని చేస్తే...దర్శిలో వైసీపీ విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.2014 ఎన్నికల్లో సిద్ధా రాఘవరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చెరో 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం. దీంతో ఈ ఎన్నికల్లోనూ మద్దిశెట్టి వేణుగోపాల్ 70కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నారు. మద్దిశెట్టికి విద్యాసంస్థలతో పాటు...ఫార్మా కంపెనీ, అమెరికాలో పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. దీంతో ఆయన ఖర్చుకు వెనుకడుగు వేసేందుకు భయపడటం లేదు. కాస్ట్‌లీ నియోజకవర్గంగా పేరు సంపాదించిన దర్శిలో రెండు ప్రధాన పార్టీలు భారీగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఓటరు ఏ పార్టీ అభ్యర్థిని కరుణిస్తాడో చూడాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

Related Posts