YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెథాయ్ తుఫాన్ కష్టాలు

పెథాయ్ తుఫాన్ కష్టాలు

అన్నదాతను పెథాయ్ తుఫాన్ కష్టాలు వెంటాడుతున్నాయి. దాదాపు 80శాతం ఖరీఫ్ వరి పంట పనలపై ఉండగా విరుచుకుపడిన పెథాయ్ తుఫాన్ వర్షాలకు తడిసిన వరి పనలను కష్టనష్టాలకోర్చి రైతులు హడావిడిగా కట్టివేత పనులు పూర్తి చేశారు. నష్టాలను భర్తీ చేసుకుని పంటను సొమ్ము చేసుకునేందుకు చేలో కుప్పలు తీసి నూర్పిడి చేసిన రైతులకు రంగుమారిన ధాన్యం రైతు ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు శాతం నాసిరకం గింజలకు పరిమితం కాగా పెథాయ్ తుఫాన్ పడగ నీడలో దాదాపు 80శాతం వరకు ధాన్యం రంగు మారడంతో కొనేనాధుడు లేక అన్నదాత కల్లాల్లో కాపురం చేస్తున్నాడు. ప్రభుత్వం నుండి, సంబంధిత అధికారులు నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రంగుమారిన ధాన్యం కొనుగోలుపై ఏ విధమైన ఆదేశాలు అందకపోవడంతో రంగుమారిన ధాన్యం కొనే నాధుడు కరువయ్యాడు. మరి కొన్ని రోజులు కుప్ప నూర్చకుండా ఉంటే నూరు శాతం ధాన్యం రంగుమారి అసలుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే కుప్పలు నూర్చి ధాన్యం రాసులు ఉండగా రైతులు శాంపిల్ పట్టుకుని కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు, దళారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు తాము పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీలైనా చెల్లించేందుకు 76 కిలోల బస్తా రూ.500 నుండి రూ.800లకు తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రంగు మారిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతాంగం కోరుతోంది. అలాగే పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతాంగాన్ని రబీలో సాగు చేసిన అపరాలు సైతం నష్టాల బాటల పట్టించేలా ఉన్నాయి. వర్షాలకు మినుము మొక్కలు చాలా వరకు చనిపోగా మరోసారి విత్తనాలు చల్లిన రైతాంగానికి సరైన మొలకలు రాక సాగు వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉన్న నాలుగు మొక్కలను కాపాడుకుని తిండి గింజలకైనా పండించుకుందామనుకున్న రైతులకు గణనీయంగా పెరుగుతున్న కలుపు, తెగుళ్లు రైతు ఆశలను ఆవిరి చేస్తున్నాయి. పంట తీసి వేసి మరో పైరు వేసుకునేందుకు సమయం అనుకూలించకపోవటంతో చేసేది లేక రైతాంగం దేవునిపై భారం వేసి ప్రభుత్వ ప్రకటనల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది

Related Posts