YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బీజేపీ జోరు.... హస్తం బేజారు..

బీజేపీ జోరు.... హస్తం బేజారు..

ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం. నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ దిశగా ఆచరణ మాత్రం కొరవడింది. ఒక పక్క పాత మిత్రులతో సీట్ల సర్దుబాటు పై ఎన్డీఏ కూటమి ముందుకు వెళుతుండగా మోదీని దించాలన్న లక్ష్యంతో హడావిడి చేసిన విపక్షాలు చతికలపడ్డాయి. ఎన్నికల ప్రకటన వెలువడి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయిన తరుణంలో విపక్షాలు ఐక్యత దిశగా ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాయి. అదే సమయంలో ఎన్డీఏ తరుపున బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా మిత్రపక్షాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తూ సీట్ల సర్దుబాటు విషయాన్ని కొలిక్కి తెస్తున్నారు.

విపక్షాల్లో అతి పెద్దదైన కాంగ్రెస్ పార్టీకి, ఇతర చిన్నా చితకా పార్టీలకూ మోదీని దించాలన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఎలా దించాలి? ఆ తర్వాత ప్రధాని ఎవరన్న విషయంపై స్పష్టత లేదు. ఎవరికి వారు తామే ప్రధాని అభ్యర్థి అని అంతరింగకంగా భావించడం పెద్ద లోపంగా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులను, బలాబలాలను దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడం ఏ పార్టీకీ మంచిది కాదు. విపక్షాల్లో అన్నింటికైనా పెద్దదైన హస్తం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిగా గుర్తించే పరిస్థితి విపక్షాల్లో ఏ కోశానా లేదు. ఎవరికి వారు తామే ప్రధాని అభ్యర్థులని భావించుకోవడమే మరో లోపం. ఇక కాంగ్రెస్ ను చాలా ప్రాంతీయ పార్టీలు ఒక శక్తిగా గుర్తించడం లేదు. అందువల్లే ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు తమ బద్ధవైరాన్ని మంచి కలసి పోటీ చేస్తున్నాయి. తమ సొంత రాష్ట్రమైన యూపీలో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించి కేవలం రెండు స్థానాలను కాంగ్రెస్ కు కేటాయించారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన హస్తం పార్టీ అసలు పొత్తులేఅక్కర్లేదని చెబుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు ల్లో మాత్రమే హస్తం పార్టీ కూటమి ఏర్పడింది.మహారాష్ట్రలో శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. కర్ణాటకలో కాంగ్రెస్,జనతాదళ్ ఎస్ ల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. తమిళనాడులో డీఎంకే,కాంగ్రెస్ మధ్య జట్టు కుదిరింది. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ కి చెందిన హిందూస్థాన్ ఆవాస్ మోర్చా, ఉపేంద్ర కుశ్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ మధ్య అవగాహన ఏర్పడింది. అదే సమయంలో కొన్ని కీలక రాష్ట్రాల్లో విపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉంది పరిస్థితి. ఉదాహరణకు ఏడు లోక్ సభ స్థానాలు గల ఢిల్లీలో ఆప్ , కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు పొడవలేదు. ఇక్కడ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కీలకమైన యూపీలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీలు దాదాపుగా కాంగ్రెస్ ను వెలేశాయి. ఎలాంటి సంప్రదింపులు లేకుండా రెండు సీట్లను కాంగ్రెస్ కు వదిలేశారు. దీంతో కాంగ్రెస్ కు మండిపోయి రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థులను నిలబెడుతుంది. ఎస్పీ, బీఎస్పీ కి చెందిన ఏడు కీలక స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పోటీకి నిలపదు. దేశ రాజకీయాలకు దిక్సూచి వంటి అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో విపక్షాల అనైక్యత వాటి దుస్థితిని తెలియజేస్తుంది. విపక్షాల ఐక్యత గురించి తరచూ ప్రస్తావించే సీపీఎం కేరళలో కాంగ్రెస్ తో పొత్తుకు ససేమిరా అంది. అదే సమయంలో బెంగాల్ లో బలహీనంగా ఉన్న సీపీఎం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ సొంత రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఆ పార్టీతో కలసి ప్రయాణించడం లేదు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ప్రయాణించిన టీడీపీ ఇప్పుడు ఏపీలో మాత్రం అందుకు సిద్ధంగా లేదు.ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం ఒక్ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేక పోయింది. ఈశాన్య ప్రాంతంలో మొత్తం 26 సీట్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలోని ప్రతి ప్రాంతీయ పార్టీతో బీజేపీ కలసి ప్రయాణిస్తుండటం విశేషం. దేశవ్యాప్తంగా ఎంతో కొంత ప్రజాదరణ కలిగిన బీఎస్పీని తమ వెంట తెచ్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమయింది. జమ్మూకాశ్మీర్ లో రెండు ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ లతో ఏ ఒక్కదానితో కూడా కాంగ్రెస్ పొత్తు పొత్తు పెట్టుకోలేకపోయింది. చాలా ఇతర రాష్ట్రాల్లోకూడా ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా అన్ని పార్టీలనూ కలుపుకుని పోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ వైఫల్యాన్ని అంగీకరించక తప్పదు. పాత మిత్రులైన డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఎం వంటి పార్టీలతో తప్ప కొత్తగా ఒక్ కొత్త పార్టీని కూడా తమ కూటమిలో చేర్చుకోలేకపోయింది. మోదీని గద్దె దించాలన్న బలమైన కోరిక ఉన్నప్పటికీ అంతిమంగా రాష్ట్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులు మాత్రమే పొత్తులకు ప్రాతిపదిక అవుతుంది. ఈ విషయంలో స్పష్టత కొరవడటంతో పొత్తులు సాధ్యపడలేదు. ‘‘ఢిల్లీలో పొత్తు – గల్లీలో కుస్తీ’’ అన్న సామెతను గుర్తుకు తెచ్చింది. అయితే ఆ రాష్ట్రాల్లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా ఆయా పార్టీలు తమతో కలసి వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి విపక్షాల అనైక్యత బీజేపీ కూటమికి ఎంతవరకూ కలసి వస్తుందనేదే పెద్ద ప్రశ్న.

Related Posts