YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలి తెరాస నేతలకు పవన్‌కల్యాణ్‌ సవాల్‌

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలి              తెరాస నేతలకు పవన్‌కల్యాణ్‌ సవాల్‌
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెరాస నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని, ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సవాల్‌ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనన్నారు. వరంగల్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను తెరాస విద్యార్థి విభాగం వాళ్లు రాళ్లతో కొట్టి తరిమారని ఈ సందర్భంగా పవన్‌ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు ఏమీ చేయని జగన్‌.. ముఖ్యమంత్రి అయితే ఇంకేం చేస్తారని నిలదీశారు. నూజివీడును ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. నూజివీడులో అంతర్జాతీయ మామిడి పండుగ చేద్దామని, స్పెయిన్‌లో టమాటో పండుగలా నూజివీడు అంటే మామిడి పళ్లు గుర్తుకు రావాలని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్‌ దొర, అంబేడ్కర్‌ వంటి మహనీయుల పేర్లు పెడతామని చెప్పారు. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం పేరు కూడా ఉండబోదని చెప్పారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకే జనసేన పుట్టిందని పవన్‌ అన్నారు. జగన్‌ ఐదుగురితో ఎన్నికల ఖర్చు పెట్టించి ఒక్కరికి టికెట్‌ ఇస్తారని విమర్శించారు. అభ్యర్థులను చెరకు రసం పిండినట్టు పిండుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతకు పాదయాత్ర పేరుతో రోడ్లమీద తిరగడమే తెలుసని.. శాసనసభకు వెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు రావాలంటే వాటాలు అడిగే పరిస్థితి వైకాపా నేతలదని మండిపడ్డారు. నూజివీడును పులివెందుల నుంచి ఆపరేట్‌ చేసే దౌర్భాగ్యం ఇక్కడి ప్రజలకు రాకూడదన్నారు. కేసీఆర్‌ కనుసైగలతో నడిచే జగన్‌లాంటి నేతను కాదన్నారు. వైకాపాను గెలిపిస్తే మనల్ని ద్రోహులని తిట్టిన తెరాసను గెలిపించినట్టేనని వ్యాఖ్యానించారు.

Related Posts