YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాపు కాసేది ఎవరు

కాపు కాసేది ఎవరు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో ఎదగాలనుకుంటున్న బీజేపీ కొత్త రాజకీయం చేస్తోందా అంటే లేదన్న జవాబే వస్తోంది. అసలు బీజేపీ సిధ్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది అన్న ప్రశ్నలు వేసుకున్నపుడు అసంతృప్తి మిగులుతుంది. ఏపీలో టీడీపీ ఏ కారణంగా ఓటమి పాలు అయింది, ఏపీలో రాజకీయ, సామాజిక వర్గ సమీకరణలు ఎలా ఉన్నాయి, వీటిని బీజేపీ పట్టించుకుంటోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో అధికారం గత కొన్ని దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాల మధ్యనే కేంద్రీకృతమైపోయాయి. అయితే రెడ్లు. లేకపోతే కమ్మలు ఇదీ ఏపీలో అధికారం పంచుకునే విధానంగా ఉంది. అయిదు కోట్లకు పైబడి జనాభా మూడున్నర కోట్ల వరకూ ఓటర్లున్న ఏపీలో కేవలం ఆ రెండు కులాలే ఉన్నాయా అన్న చర్చ ముందుకువస్తోంది. అన్ని విధాలుగా బలంగా ఉన్న ఆ రెండు కులాలను ఢీ కొట్టాలని ఇతర సామాజిక వర్గాలు, పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. దీంతో యధేచ్చగా రాజకీయం అలా సాగిపోతోంది.ఇక జాతీయ స్థాయిలో ఇపుడు బీజేపీ బలంగా ఉంది. మరికొన్నేళ్ల వరకూ బీజేపీని కదిపే పరిస్థితి ఎవరికీ లేదని ఇపుడున్న రాజ‌కీయ అంచనాలు బట్టి చూస్తే అర్ధమవుతుంది. అదే సమయంలో దక్షిణాదిన బీజేపీ బలపడాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అయితే దానికి కావల్సినదేంటో బీజేపీ తెలుసుకోలేకపోతోంది. ఏపీలో కాపులు అతి పెద్ద శక్తిగా ఉన్నారు. మొత్తం జనాభాలో పాతిక శాతం వరకూ ఉన్నారని ఓ
అంచనా. అదే విధంగా మొత్తం 175 సీట్లలో 75 సీట్ల వరకూ గెలుపు ఓటములను కాపులు ప్రభావితం చేస్తారని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఓ విధంగా అధికారం అందుకోవడానికి అవసరమైన సామాజిక బలం కలిగి ఉన్న కాపులను అక్కున చేర్చుకుని సముచిత స్థానం ఇస్తే బీజేపీ ఏపీలో పటిష్టం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ కాషాయం పార్టీ తానూ ఆ తానులో ముక్కేనని అంటోంది.బీజేపీ ఇపుడు ఎలా తయారైంది అంటే టీడీపీకి బీ టీం గా ఉందని చెప్పాలి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ తీసుకోవడం ద్వారా బలం ఏ మాత్రం పెంచుకోకపోగా జనంలో పలుచన అయింది. చంద్రబాబుకు సన్నిహితులుగా అంతా భావించే సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని చేర్చుకుని బీజేపీ బావుకుందేమిటి అంటే వృధా ప్రయాస అన్న మాట వస్తుంది. ఇక చంద్రబాబు చేసిన తప్పులకు జనం దూరంగా పెట్టారు. ఆ తప్పుల్లో సుజనా వంటి వారి భాగం లేదనా బీజేపీ ఉద్దేశ్యం అని జనం నుంచే కాదు, పార్టీ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక కమ్మ సామాజికవర్గం అధికారాన్ని నలభయ్యేళ్ళుగా అనుభవిస్తోంది. వారినే మళ్లీ అందలం ఎక్కించి బీజేపీ టీడీపీకి కార్బన్ కాపీలా మారాలనుకుంటే ఎప్పటికీ ఏపీలో ఆదరణ లభించదని అంటున్నారు. బీసీలు, కాపులు, బడుగు, బలహీన వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని అక్కున చేర్చుకుని సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ చేస్తే బీజేపీకి మంచి రోజులు వస్తాయి తప్ప టీడీపీలోని
రాజకీయ తుపాను బాధితులకు ఆశ్రయం ఇస్తే కమలం ఎప్పటికీ పవర్లోకి రాక విలపించకతప్పదని రాజకీయ పండితులు సైతం హెచ్చరిస్తున్నారు.

Related Posts