YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహిళలు స్వయంశక్తితో ఎదగాలి ‘అనంత’ను రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలపాలి

మహిళలు స్వయంశక్తితో ఎదగాలి ‘అనంత’ను రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలపాలి

మహిళలు స్వయంశక్తితో ముందుకు సాగి ఆర్థికాభివృద్ధి సాధించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్ (ఎల్కేపీ)లో గురువారం మెప్మా ఆధ్వర్యంలో పర్యావరణ మిత్రలకు ‘హోం కంపోస్టింగ్ కిట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముందుగా మునిసిపల్ కమిషనర్ ప్రశాంతి, మెప్మా పీడీ విజయలక్ష్మితో కలిసి ఎల్కేపీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ‘మెప్మా బజార్’ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ సంఘాల సభ్యులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను, ఆహార ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచగా వాటిని తిలకించిన ఎమ్మెల్యే.. మహిళలను అభినందించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలేనని, ఇంట్లోని మహిళా సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే కాకుండా సమాజం కూడా కళకళలాడుతుందన్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు స్వశక్తితో ఎదిగి తాము పొదుపు చేసిన సొమ్ముతో జీవన విధానాన్ని మార్చుకోవాలన్నారు. సంఘాలకు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొదుపు సొమ్మును కొందరు కాజేస్తున్నట్లు తెలుస్తోందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనర్థాలు ఎక్కువని, పేపర్ కవర్లు వాడడం అలవర్చుకోవాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో హోం కంపోస్ట్ తయారు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, సేంద్రియ ఎరువును ఇంట్లోనే తయారు చేసుకుని కూరగాయలు సాగు చేసుకుంటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదరికం కారణంగా చాలా మంది చదువుకు దూరమవుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. మనం మెరుగైన జీవితం గడపాలంటే చదువు తప్పనిసరని సూచించారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని మహిళా సంఘాలు రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలవాలని ఆకాంక్షించారు. మహిళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవచ్చని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇళ్లు లేని వారందరికీ పక్కా గృహాలు ఇస్తామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. దళారుల మాటలు విని మోసపోవద్దని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా మహిళల చేతికే అందిస్తామని స్పష్టం చేశారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఎరువుగా వాడుకోవచ్చన్నారు. హోం కంపోస్టింగ్ ద్వారా చేసే ఎరువును మొక్కలకు వాడడం శ్రేయస్కరమన్నారు. మహిళా సంఘాలు క్రమశిక్షణతో మెలిగి రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలని మెప్మా పీడీ విజయలక్ష్మి సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని చెప్పారు. అంతకుముందు హోం కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలో ప్రమీలా వివరించారు. చివరగా మహిళలకు హోం కంపోస్టింగ్ కిట్లను ఎమ్మెల్యే అనంతతో పాటు కమిషనర్ ప్రశాంతి, మెప్మా పీడీ విజయలక్ష్మి అందజేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ సెక్రటరీ శ్రీనివాసులు, మెప్మా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శివశంకర్, అనంత పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లలిత, నగర పాలక సంస్థ, మెప్మా అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు.

Related Posts