YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజధాని కట్టాలనే ఆలోచన జగన్‌కు ఉందా? నవ్యాంధ్ర నూతన నగరంపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి

రాజధాని కట్టాలనే ఆలోచన జగన్‌కు ఉందా? నవ్యాంధ్ర నూతన నగరంపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిష్టకు ప్రతిరూపమైన రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక పనులన్నీ నిలిపివేయడమే గాక, ఇప్పుడు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని రాజధానిని వేరొక చోటకి తరలిస్తున్నారంటూ దుష్ప్రచారం చేయడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభసభ్యులు గల్లా జయదేవ్‌ తెలిపారు.  గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రోడ్లు, భవనాల నిర్మాణాలతో, వేలాది మంది పనివాళ్లతో, నిత్యం వచ్చే సందర్శకులతో  సందడిగా ఉండే ఆ ప్రాంతమంతా, వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానాలు, దుందుడుకు చర్యల వల్ల నేడు ఎడారిని తలపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదవల్ల జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చడానికి, ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం, రాజధాని అమరావతి కేంద్రంగా దుష్ట రాజకీయాలకు తెరలేపిందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చూస్తుంటే, అసలు ఈ ప్రభుత్వానికి రాజధాని కట్టే ఉద్దేశం ఉందో, లేదో వెంటనే జగన్మోహన్‌రెడ్డే స్వయంగా చెప్పాలని జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు తనకున్న అపార అనుభవం, దూరదృష్టితో మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, విభజనానంతరం ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించారన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రపంచం మెచ్చేలా ఒక నగరానికి రూపకల్పన చేయడం కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నార్మన్‌ఫోస్టర్స్‌ సంస్థతో అమరావతి డిజైన్లు తయారు చేయించడం జరిగిందని జయదేవ్‌ పేర్కొన్నారు. ఆపిల్‌ కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్‌ అందించిన నమూనాలతో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగిందన్న ఆయన, ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌ బ్యాంకులను సంప్రదించి అమరావతి నిర్మాణానికి నిధులు వచ్చేలా చర్యలు చేపట్టగా రోడ్లు , భవనాల నిర్మాణం ఊపందుకుందన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతి నిర్మాణానికి మోకాలడ్డిందని గల్లా తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసిందని, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అమరావతి ప్రాంతంలోని రైతులను రెచ్చగొట్టి, భూములివ్వకుండా చేయడం, పంటలు తగులపెట్టించిన ఘనత ఆ పార్టీకే దక్కిందన్నారు. అదేవిధంగా భూసేకరణలో, నిర్మాణాల్లో అవినీతి జరిగిందని వైసీపీ గగ్గోలు పెట్టిందన్నారు. అధికారం చేపట్టిన తరువాత కూడా ఎక్కడా అమరావతి గురించి గానీ, అక్కడ చేయాల్సిన పనులు, జరిగిన పనుల గురించి గానీ వైసీపీ ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేకపోవడం విచారకరమని గల్లా చెప్పారు. ఈ ప్రభుత్వ అసమర్థత కారణంగా ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు  రాజధాని నిర్మాణానికి ఇస్తామన్న రూ.8వేల కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయన్నా రు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు తప్ప, నూతన ప్రభుత్వం వచ్చి 3 నెలలైనా ఎక్కడా ఒక్క చదరపు గజంలో కూడా పని జరిగిన పాపాన పోలేదని జయదేవ్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.38వేల కోట్లరూపాయలకు టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రూ.9వేల కోట్ల పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఈ పరిణామాలన్నీ ఒకెత్తయితే తాజాగా, రాజధాని తరలింపు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని, అందుకు కృత్రిమ వరదను సాకుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డా రు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున దిగువకు పెద్దఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించినా వినకుండా, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని గల్లా ఆక్షేపించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద ప్రవాహం రాష్ట్రానికి వస్తుందని ఒక వారం ముందే తెలిసినప్పటికీ, దాన్ని నిలువరించకుండా ఒక్కసారిగా వరదనీటిని తీసుకొచ్చి రాజధానిని ముంచాలనే దురాగతానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టిందన్నారు. రాష్ట్రంలోనికి ఎంత వరద వస్తుంది... ప్రాజెక్టుల్లో ఏ స్థాయిలో వరద నీటిని నిల్వ చేయాలి... వచ్చే నీటిని ఎంతమొత్తంలో దిగువకు వదలాలి .. అనే కనీస విచక్షణ కూడా లేకుండా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని ముంచడంపైనే  వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని టీడీపీ ఎంపీ దుయ్యబట్టారు. వరద కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రదేశాల్లోని ప్రజలను ముందుగా హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముంపు ప్రాంతాల్లో వరదనీటిలో, బురదలో మగ్గిపోతున్న ప్రజల్ని కన్నెత్తైనా చూడకుండా మంత్రులంతా, ఇప్పటికీ కట్టుకథలు, కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని గల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా వచ్చిన వరదల వల్ల 50వేల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయని, 10 వేలకు పైగా కుటుంబాలు  వీధుల పాలయ్యాయని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఇంతవరకు ఏ విధమైన సహాయ చర్యలు చేపట్టలేదని, కనీసం తాగునీరు, ఆహారం కూడా తమకు అందించలేదని బాధితులంతా టీడీపీ అధినేత చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారని జయదేవ్‌ తెలిపారు. జనాలను, చంద్రబాబు నివాసాన్ని ముంచడానికి వరదలను వాడుకున్న ప్రభుత్వం, రాయలసీమ తదితర కరవు ప్రాంతాలకు ఆ నీటిని తరలించడానికి  ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం రాష్ట్ర పెద్దల చేతగానితనం కాదా అని గల్లా నిలదీశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని తరలింపు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ప్రజల నమ్మకానికి పాతరేసేలా, రాష్ట్రానికి భవిష్యత్‌ లేకుండా, దూరదృష్టి లేని నిర్ణయాలు తీసుకుంటూ, దుందుడుకు చర్యలతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని జయదేవ్‌ వ్యాఖ్యానించారు.

Related Posts