YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప జిల్లాల్లో కొత్త సమీకరణాలు

కడప జిల్లాల్లో కొత్త సమీకరణాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కడప జిల్లాకు వైఎస్సార్ మరణాంతరం ఆయన పేరు పెట్టారు కానీ నిజానికి నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లా వారి పేరు మీదనే రాజకీయం చేస్తోంది. వారి హవాతోనే ముందుకుసాగుతోంది. కడప అంటే వైఎస్సార్ కుటుంబమే గుర్తుకువస్తుంది. కడప జిల్లాలో తాజా ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకుంది. అలాగే రెండు ఎంపీ సీట్లు కూడా ఫ్యాన్ ఖాతాలో పడ్డాయి. అటువంటి కడపలో జగన్ పలుకుబడిని తగ్గిద్దామని అప్పట్లో బలమైన తెలుగుదేశం పార్టీ చేయని ప్రయత్నం లేదు. అధికారం చేతిలో ఉంచుకుని అయిదేళ్ళ పాటు కడప నుంచే కధను నడిపిన బాబు వైసీపీలో ఉన్న గట్టి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తమవైపుకు తిప్పుకుని మంత్రిని కూడా చేశారు. అయినా కడపలో సైకిల్ చిత్తు అయింది.ముఖ్యమంత్రి జిల్లా అంటే ఆ పొలిటికల్ గ్లామర్ వేరేగా ఉంటుంది. ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీ వచ్చిన వారిని వచ్చినట్లే కండువాలు కప్పి చేర్చుకుంటోంది. మరో వైపు రాయలసీమ జిల్లాలపైన కూడా కన్ను వేసింది. అక్కడ బలమైన వైసీపీని నిలువరించే నాయకుల కోసం బీజేపీ ముమ్మరంగా గాలిస్తోంది. కోట్ల కుటుంబంతో పాటు, భూమా కుటుంబాన్ని కూడా చేర్చుకోవాలను కుంటోంది. ఇక జగన్ సొంత జిల్లా కడప పైన ప్రత్యేక దృష్టి సారించడంలో ఆశ్చర్యం లేదు. కడపలో నిన్నటి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డికి కాషాయ తీర్ధం ఇప్పించేందుకు తెరవెనక కసరత్తు జరుగుతోంది. ఓడిపోయినా కూడా జమ్మలమడుగులో బలమైన నేతగా ఆది ఉన్నారు. ఇక ఆయన వంటి నేత పార్టీలోకి వస్తే కడపలో కాలు మోపవచ్చునన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఈ మధ్యనే హైదరాబద్ వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆది నారాయణరెడ్డి కలవడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటాయని అర్ధమవుతోంది.ఇక కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో ఆదికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఓ విధంగా రమేష్ చొరవతోనే ఆది బీజేపీ వైపు వస్తున్నారనుకోవాలి. ఆది కనుక వస్తే మాస్ లీడర్ ఒకరు బీజేపీ గూటికి చేరినట్లవుతుందని అంటున్నారు. కడపలో ఇపుడు వైసీపీ హవా బాగా ఉన్నా రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు, అది కూడా అధికారంలో ఉన్న పార్టీకి వెంటనే వ్యతిరేకత కూడా తోడవుతుంది. దాంతో జగన్ గతంలోలా తన రాజకీయ‌ పలుకుబడిని పెంచుకోలేరని, అందువల్ల పార్టీ విస్తరణకు ఇదే అవకాశమని బీజేపీ భావిస్తోంది. ఆది వంటి నాయకుడు వస్తే మరింతమంది ఇతర పార్టీల నుంచి చేరిక జరుగుతుందని కూడా బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే జయాపజయాలతో నిమిత్తం లేకుండా వైఎస్ కుటుంబానికే అంకితం అయిన కడప గడపలో జగన్ ని ఢీ కొట్టడం అంటే మాటలు కాదని కూడా చర్చ ఉంది. ఏది ఏమైనా బీజేపీ కి ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈ చేరికలు పనికివస్తాయని అంటున్నారు. చూడాలి మరి.

Related Posts