YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆటోనగర్‌ కేరాఫ్‌గా అక్రమాలు

ఆటోనగర్‌  కేరాఫ్‌గా అక్రమాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మంగళగిరిలోని  ఆటోనగర్‌ అక్రమాలకు కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. ఆటోమొబైల్‌ రంగం మొత్తాన్ని ఒక చోటకి చేర్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచి పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీఐఐసీ పట్టణంలో ఆటోనగర్‌ ఏర్పాటు చేశారు. 116 ఎకరాల భూములను సేకరించి ఆటోనగర్‌ స్థాపించారు. ఆటోనగర్‌లో వివిధ రంగాలకు చెందిన 396 మందికి పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా స్థలాల ధరలు పెరిగిపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఏపీఐఐసీ నుంచి తక్కువ ధరలకు తీసుకుని అధిక ధరలకు విక్రయించారనే విమర్శలున్నాయి. అధిక మంది లబ్ధిదారులు ఈ విధంగానే విక్రయాలు చేసి సొమ్ము చేసుకోగా ఇప్పుడున్న వారిలో సగానికి పైగా స్థలాలను విక్రయాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.ఏపీఐఐసీ నిబంధనల మేరకు పరిశ్రమ నెలకొల్పేందుకు స్థలం తీసుకున్న యజమాని గడువు సమయంలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే 12 ఏళ్లు కొందరు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి 55 మంది తాను తీసుకున్న స్థలాల్లో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో ఏపీఐఐసీ అధికారులు తిరిగి స్థలాలను అప్పగించాలని నోటీసులు జారీ చేయడంతో స్థలాల యజమానులు కోర్టును ఆశ్రయించి కాలయాపన చేస్తున్నారు.
పట్టణానికి దగ్గరగా ఉండడంతో ఆటోనగర్‌లోని స్థలాల ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు చేయకూడదనే నిబంధనలను అతిక్రమించి విక్రయాలు జరిపారు. మరో వైపు స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం లేకపోయినా కొనుగోలుదారులు కేవలం స్వాధీన విక్రయ అగ్రిమెంట్‌లతో కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు నిబంధనలను తుంగలో తొక్కి కల్యాణ మండపాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్‌ గోడౌన్‌ పేరుతో స్థలం పొంది కల్యాణ మండపం నిర్మించి రూ.లక్షలు అర్జిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఐటీ హబ్‌కు ఆటోనగర్‌లోని స్థలాలను తక్కువ ధరలకు కేటాయించింది.పది ఎకరాలు కేటాయించినా తొలి దశ పనులు పూర్తి కాగా రెండో దశ పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించగా వాటిలో ఇప్పటికి కొన్ని కంపెనీలు గడువు ముగిసినా పనులు ప్రారంభించలేదు. రాజధానిలో ప్రధాన పట్టణంగా విస్తరిస్తున్న మంగళగిరి ఆటోనగర్‌పై అధికారులు దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్టవేసి పరిశ్రమలను స్థాపించే వారికి స్థలాలను కేటాయిస్తే పరిశ్రమలు ఏర్పాటు కావడంతో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని ఆ దిశగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related Posts