YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జనసంద్రంగా కోడెల అంతిమయాత్ర

జనసంద్రంగా కోడెల అంతిమయాత్ర

జనసంద్రంగా కోడెల అంతిమయాత్ర
గుంటూరు, సెప్టెంబర్ 18, 
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం స్వర్గపురిలో ఏర్పాటు చేశారు.గుంటూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, ఎస్పీ జయలక్ష్మి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. అందుకు కోడెల కుటుంబీకులు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో నరసరావుపేట చేరుకుంటున్నారు. కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ఆయన అభిమానులు కోడెల నివాసానికి చేరుకుంటున్నారు. కోడెలను చివరిసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు క్యూలైన్లలో బారులుదీరారు. పెద్దఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోట సెంటర్ జనసంద్రంగా మారింది.కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో బంద్ పాటించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది.కడసారి చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోడెల సేవలను గుర్తు చేసుకుంటున్నారు. నరసరావుపేట అభివృద్ధి ఆయన చలవేనంటూ గుర్తుచేసుకుంటున్నారు. కోడెల లాంటి నాయకుడు మళ్లీ రాలేడని చెబుతున్నారు. నరసరావుపేటకు నీటి కొరత లేకుండా చేసిన గొప్పనాయకుడని కితాబిస్తున్నారు. పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కోటప్పకొండను ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదంటూ కోడెల సేవలను స్మరించుకుంటున్నారు.

Related Posts