YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంభంపాటికి కేంద్రమంత్రి పదవి?

కంభంపాటికి కేంద్రమంత్రి పదవి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి రావడం, కేంద్ర మంత్రి పదవులకు సుజనాచౌదరి, అశోక్గజపతిరాజు రాజీనామా చేయడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశమేర్పడింది. గతంలోనే హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని పార్టీ శ్రేణులు భావించినా వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. తెదేపా ఎంపీలు కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం ప్రస్తుతం హరిబాబుకు కలిసొచ్చింది. శనివారం సాయంత్రం దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన భాజపా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. హరిబాబును కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కసరత్తు జరిగినట్లు సమాచారం. సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు.. వీరిలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మేలు జరుగుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భాజపా నేతల భేటీకి ఏపీలో వైకాపా వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్కిషోర్ హాజరుకావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రశాంత్ కిషోర్ గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అధ్యయనం చేస్తున్నందున ఆయన సలహాలను కూడా అమిత్ షా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో భాజపాకు వ్యూహకర్తగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో భాజపాకు, రాష్ట్రంలో వైకాపాకు వ్యూహకర్తగా పనిచేయడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ దారితీసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన భాజపాతో వైకాపా అంటకాగుతోందని తెదేపా తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ భాజపా నేతల భేటీకి హాజరుకావడం తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. 2014లో భాజపా, తెదేపాలకు మద్దతిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతంలో కాకినాడ సభలో భాజపాపై విమర్శలు గుప్పించడం, తాజాగా మంగళగిరిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తెదేపాపై అవినీతి ఆరోపణలు చేయడంపై భాజపా నేతలు చర్చించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరి ఏమిటి, రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై చర్చించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా భాజపా అంధ్రప్రదేశ్ ద్రోహం చేసిందని తెదేపా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలని భాజపా నేతలు నిర్ణయించారు. ప్రత్యేక హోదాతో వచ్చే సాయాన్ని ప్యాకేజీ ద్వారా ఇస్తామని చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని బాజపా నేతలు రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్ర భాజపా నేతలు అమిత్ షాతో భేటీ తర్వాత తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ఎదురుదాడికి సిద్ధమవుతారో వేచి చూడాల్సిందే.

Related Posts