YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఝార్ఖండ్ లో 'బీజేపీ' ఓటమి స్వయంకృతాపరాధమేనా?

ఝార్ఖండ్ లో 'బీజేపీ' ఓటమి స్వయంకృతాపరాధమేనా?

ఝార్ఖండ్ లో 'బీజేపీ' ఓటమి స్వయంకృతాపరాధమేనా?
రాంచీ డిసెంబర్ 24
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ ఆధ్వర్యంలోని మహా కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అధికంగా 30 స్థానాలు గెలుచుకున్న జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సొరేన్ యే ముఖ్యమంత్రి అని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేశాయి.ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. బీజేపీ పార్టీ తన స్వయంకృతాపరాధం వల్లనే అధికార పగ్గాలు చేపట్టేందుకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఒంటరి పోరు, ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం, అవినీతిపరులను పార్టీలో చేర్చుకోవడం, సీఎం అహంకార ధోరణి, పార్టీ టికెట్ల కేటాయింపు తదితర అంశాలకు తోడు క్లైమాక్స్ లో సీఎఎ, ఎన్నార్సీలపై జాతీయ స్థాయిలో జరిగిన ఆందోళనలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి.జేఎంఎం గెలుచుకున్న 30 స్థానాల్లో ఆదివాసులకు ప్రాబల్యమున్న 28 నియోజకవర్గాల్లోనే 20 స్థానాలను గెలుచుకోవడం విశేషం. గత ఎన్నికల్లో జేఎంఎం కేవలం 19, కాంగ్రెస్ 6 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. ఈసారి జేఎంఎం 30, కాంగ్రెస్ 16 గెలిచాయి. భూ సేకరణ చట్టం లోని సవరణలు ఆదివాసుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. గతంలో బీజేపీ అలయెన్స్ కు మద్ధతు ఇచ్చిన ఆదివాసీ క్రిస్టియన్లు ఈసారి జేఎంఎం మహా సంకీర్ణం వైపు మొగ్గు చూపారు. ఆదివాసీ సెంటిమెంట్ దెబ్బతీసేలా బీజేపీ సర్కారు నిబంధనలు ఉండటంతో పథల్ఘడీ ఉద్యమం బలోపేతమై బీజేపీ ఓటు బ్యాంకుకు, సీట్లకు గండిపడింది.'మేం విభిన్నం' అంటూనే సీఎం రఘుబర్ దాస్ తన అనుచరుల అవినీతి, అక్రమాలకు కొమ్ముకాయడం, టీచర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎంఎం మాజీ నేత శశి భూషణ్ మెహతాను పార్టీలోకి చేర్చుకోవడం, 130 కోట్ల మెడికల్ స్కాంలో నిందితుడైన స్వతంత్ర ఎమ్మెల్యే భాను ప్రతాప్ షాహి ని పార్టీలోకి చేర్చుకోవడం, సిట్టింగ్ బీజేపీ ఎంపీ దుల్లూ మెహతాకు పార్టీ టికెట్ కేటాంచడం, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ పార్టీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడం తదితర స్థానిక అంశాలెన్నో బీజేపీని అధికారంలోకి రాకుండా చేశాయి.సీఎఎ, ఎన్నార్సీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆదివాసీలు, ఆదివాసీ క్రిస్టియన్లలో నెలకొన్న భయాందోళనలను ఆ పార్టీ నాయకులు సమర్థవంతంగా తొలగించలేకపోయారు. నిజానికి సీఎఎ, ఎన్నార్సీల ఆందోళనలే ఎన్నికల్లో అత్యంత ప్రభావితం చూపాయని చెప్పలేం. నిజంగా ఆ ఆంశాలే ప్రభావితం చూపితే బీజేపీ 25 స్థానాలను గెలుచుకునేది కాదు. ఇంకా చిత్తుగా ఓడిపోవాలి కూడా. కానీ అలా జరగలేదు. జేఎంఎం తర్వాత బీజేపీనే అధిక స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ముఖ్యంగా రాహూల్ గాంధీకి వ్యక్తిగతంగా కొంత 'విశ్వాసం'ను జేఎంఎం పార్టీ మళ్లీ ఇవ్వగలిగింది. ఝార్ఖండ్ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే అక్కడి ప్రాంతీయ అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపాయని ఫలితాల సరళిని బట్టి తెలుస్తున్నది.

Related Posts