YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతుకు భరోసా... (కృష్ణాజిల్లా)

రైతుకు భరోసా... (కృష్ణాజిల్లా)

రైతుకు భరోసా... (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, డిసెంబర్ 24: వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రైతు భరోసా కింద నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వారికి వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చేలా అన్ని మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మండలానికి ఒక విజ్ఞాన కేంద్రం (నాలెడ్జ్‌ హబ్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి భవనాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖాధికారులు రైతులకు మరింత చేరువలో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. జిల్లాలో తొలివిడతగా మండలానికి ఐదు చొప్పున సుమారు 250 భరోసా కేంద్రాలు, 50 నాలెడ్జ్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఆధునిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను ఇస్తూ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. జనవరి 1 లోగా ఈ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు రావటంతో వారు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. వ్యవసాయంలో రైతుల సందేహాలను నివృత్తి చేయడం ఈ కేంద్రాల ఉద్దేశం. ఇప్పటి వరకు అధికారులు ఇదే తరహా సేవలు అందిస్తున్నా.. ఈ కేంద్రాల ద్వారా స్థానికంగానే మెరుగైన సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. వీటికి అనుసంధానంగా వ్యవసాయ పరిశోధన, కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి సీజన్‌ వారీగా నిపుణులు, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాల నుంచే రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పరికరాలను అందజేయనున్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. దీంతో నకిలీలు, కల్తీలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రాల్లో రైతులకు ఆన్‌లైన్‌ సేవలు అందించనున్నారు. ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగు చేసే విత్తనాలను నమూనా కోసం ఉంచుతారు. ఆన్‌లైన్‌ సేవల కోసం కంప్యూటర్‌ తెర ఏర్పాటు చేస్తారు. అన్నదాతలకు అవసరమయ్యే రూ.2 లక్షల విలువైన వివిధ రకాల సామగ్రితోపాటు సేద్యానికి ఉపకరించే దినపత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంచుతారు. రైతులు రోజూ ఈ కేంద్రానికి వచ్చి వాటిని చదువుకోవచ్ఛు అంతర్జాలం ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తారు. రైతులకు సాగు వ్యయం తగ్గించే విధంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నారు. బీజామృతం, జీవామృతం, పంచగవ్యం వంటి ప్రకృతి ఎరువుల తయారీ విధానాన్ని నేర్పిస్తారు. ఈ కేంద్రాల్లో భూసార పరీక్షలు చేస్తారు. రైతుల వివరాలు, వ్యవసాయ భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటల వివరాలు, పాడిపశువుల వివరాలను పొందుపరుస్తారు.

Related Posts