ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలతో సోమవారం భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరు, అవిశ్వాస తీర్మానం అంశాలపై ఎంపీలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై అయన ఎంపీలతో చర్చనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై వరుసగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితులు నెలకొవడం.. సమావేశాలు వరుసగా వాయిదాపడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోమవారం విరామం తీసుకోనుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.