Highlights
- పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరులో శ్రీకారం
- డీలర్ల నుంచి విశేష స్పందన
- 100 మాల్స్ ఏర్పాటుకు సర్కారు ఆమోదం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న మాల్స్ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్‌మాల్ విజయవంతంగా నడుస్తుండటంతో ఈ మాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు డీలర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. దీని దృష్ట్యా గుంటూరు జిల్లాలో మరో 100 మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం శ్రీనివాసరావుపేటలో ఏర్పాటు చేసిన మాల్‌కు ప్రతీ నెలా టర్నోవర్ రూ.3.50 లక్షల వరకు ఉంటోంది. డీలర్‌కి ఆదాయం కూడా రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యన ఉంటోంది. ఈ నేపథ్యంలో డీలర్లకు జీవనోపాధిని కల్పించేందుకు చంద్రన్న విలేజ్‌మాల్స్‌ని విస్తరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దుర్గి, తాడేపల్లి, తెనాలి, పొన్నెకల్లు, తాడికొండ, ఏటుకూరు, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, చుండూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల తదితర ప్రాంతాల్లో వంద మాల్స్ ఏర్పాటు చేసేందుకు డీలర్ల నుంచి ఆమోదం తీసుకున్నారు. సొంత భవనం కలిగి 200 చదరపు అడుగుల కనీస విస్తీర్ణం ఉన్న వాటినే మాల్స్‌కి ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన వాటిని కేపీఎంజీ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో ఒక్కో మాల్‌కి రూ.3 లక్షలకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తుంది.