YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో టీడీపీకి ఎదురు దెబ్బలు

ప్రకాశంలో టీడీపీకి ఎదురు దెబ్బలు

ప్రకాశంలో టీడీపీకి ఎదురు దెబ్బలు
ఒంగోలు, మార్చి 21, నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఎన్నికలను చూసిన ఆయన.. ఇప్పుడు చూస్తున్న లోకల్‌ బాడీ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమైనవి. ఎన్నడూ ఎదురు కాని అనుభవాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే.. స్థానిక సంస్దల ఎన్నికల హడావుడిలో చంద్రబాబు తలమునకలై ఉండగా టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. చంద్రబాబుకు సమకాలికుడైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడటంపై పెద్ద చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలగిన బలరాం పార్టీ వీడటం పెద్ద దెబ్బ అని అంటున్నారు. బలరాం విషయంలో పార్టీ చేసిన అన్యాయం ఏంటన్నది ఎవరికీ బోధపడడం లేదు.1985లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో గొడవ పెట్టుకొని మరీ మార్టూరు సీటు బలరామ్‌కి చంద్రబాబు ఇప్పించారని, అలాగే 1994లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన బలరామ్‌ను తర్వాత టీడీపీలో చేర్చుకొని ఒంగోలు ఎంపీని చేశారని, 2014లో టీడీపీ గాలిలో కరణం వెంకటేశ్‌ ఓడిపోయినా బలరామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టి ఆర్థికంగా అండదండలు అందించి గెలిపించారని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీలో చేరారు. ఎక్కడో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోతుల సునీతను 2014లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించారు. ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండదండలు అందించారనే చర్చ జరుగుతోంది.మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన బాబురావు పార్టీపై తీవ్ర విమర్శలు చేసి వెళ్లారు. బాబూరావు అంత సమర్థుడైన నేత కాకపోయినా బాలకృష్ణ ముఖం చూసి వరుసగా నాలుగు సార్లు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి.. అధినేతను విమర్శించటం ఎంతవరకు సబబని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయడం చేతగాని వ్యక్తి బాబూరావుపై విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడా పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. ఆయన ఇంకా ఊగిసలాటలో ఉన్నారు.టీడీపీతో లబ్ధి పొందిన నేతలంతా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపించడంతో కేడర్‌ అయోమయానికి గురవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే జంపైపోయారు. ఆయనకి చంద్రబాబు ఏం తక్కువ చేయలేదు. ఐదేళ్లలోనే ఆయనకు ఎన్నో అవకాశాలు కల్పించి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయంలో చంద్రబాబును పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు కూడా. ఇక దేవినేని అవినాశ్‌కు సైతం పార్టీలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగు యువత అధ్యక్ష పదవి, గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఇచ్చారు. అయినా వైసీపీకి వెళ్లిపోయారు.విశాఖ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు కూడా పార్టీని వీడారు. ఆయన 2014లో గంటాతో పాటు టీడీపీలో చేరారు. యలమంచిలిలో పోటీ చేసి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. రాయలసీమ ప్రాంతంలో వలసలు ఆగేలా కనిపించడం లేదు. నేతలు ఒకరి వెనుక ఒకరు వైసీపీకి ఆకర్షితులు అవుతున్నారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దివంగత శివారెడ్డి వారసుడిగా పార్టీలో తనదైన శైలిలో ముందుకు పోయారు రామసుబ్బారెడ్డి. ఆయనను కూడా చాలా విషయాల్లో చంద్రబాబు ఆదుకున్నారు.పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. చిన్న స్థాయి నాయకుడైన సతీష్‌రెడ్డిని మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేసిన ఘనత చంద్రబాబుదేనని పార్టీ వర్గాల్లో ఉంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సైతం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీపై విమర్శలు చేశారు. పార్టీ ద్వారా కేఈ కుటుంబం ఎన్నో విధాలుగా లబ్ధి పొందిందని, కీలక సమయంలో ఇలా రాజీనామా చేయటంతో పార్టీ నేతలంతా నివ్వెరపోయారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా పార్టీ వీడేందుకు సిద్ధమైపోయారు.అధికార పార్టీ వైసీపీ దెబ్బకు జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయిపోతుండడంతో టీడీపీలో ఎ్పపటి నుంచో ఉంటున్న కార్యకర్తలు బిత్తరపోతున్నారు. అధినేత చంద్రబాబు ఎంత బుజ్జగించి తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా.. అధికార పార్టీ ఒత్తిడిని ఆ నేతలు భరించలేకపోతున్నారు. అందుకే వైసీపీలోకి చేరిపోవడమో.. లేక మద్దతుగా నిలవడమో చేస్తున్నారని జనాలు పరిస్థితులు ఇలానే కొనసాగితే పార్టీని కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతుంది. అయితే, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరిగేదే అని కూడా కొందరు నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts