YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు మేయర్ పై టీడీపీ కన్ను

గుంటూరు మేయర్ పై టీడీపీ కన్ను

గుంటూరు మేయర్ పై టీడీపీ కన్ను
గుంటూరు, మార్చి 21, రాజధాని మార్పు నిర్ణయం తర్వాత అమరావతిలో ఎవరిది పైచేయి. వైసీపీకి జనం జై కొడతారా.. టీడీపీ సత్తా చాటుతుందా. లేక జనసేన-బీజేపీల కూటమి బలపడుతుందా. గుంటూరు కార్పొరేషన్‌లో ఎవరు పై చేయి సాధించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి మూడు బలమైన పార్టీలు కార్పొరేషన్ మేయర్ పీఠంపై గురిపెట్టాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ-జనసేన కూటమిల మధ్య ట్రైయాంగిల్‌ పోరు జరగనుంది. 1994లో గుంటూరు నగరం కార్పొరేషన్‌గా అవతరించింది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు ఎన్నికలు జరగగా రెండు సార్లు టీడీపీ, ఒక సారి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. నగర పాలక సంస్థకు 2005లో చివరిసారిగా ఎన్నికలు జరగగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం లేకుండానే కార్పొరేషన్‌లో అధికారుల కనుసన్నల్లో కార్యకలాపాలు సాగాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసినప్పటికీ అది సాధ్యపడలేదు.అయితే ప్రస్తుతం హైకోర్టు అదేశాలతో గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికల జరగనున్నాయి. కార్పొరేషన్ మేయర్ పీఠంపై మూడు ప్రధాన పార్టీలు కన్నేశాయి. సామాజిక వర్గాల వారిగా అంచనాలతో ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలపబోతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపితోపాటు, బిజెపి, జనసేన పార్టీలు సైతం ఉమ్మడిగా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.దీంతో అందరి చూపు గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై పడింది. ఇక్కడి ఎన్నికల రాజకీయాలు ఎలా నడువబోతున్నాయన్న దానిపై సర్వత్రా చర్చసాగుతోంది. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ, అమరావతి రాజధాని మార్పు అంశం కాస్త ప్రతికూలమనే చెప్పాలి. అయితే వైసీపీలో ప్రస్తుతం ఉన్న స్థానిక నేతలంతా గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారే. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామనే ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.అటు తెలుగుదేశం పార్టీ సైతం కార్పొరేషన్ ఏర్పాటైన తరువాత జరిగిన రెండు ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవటంతో ఈసారి ఎలాగైనా గుంటూరు కార్పొరేషన్ పై జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో ఉంది. రైతులు తమకే అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం గుంటూరు మేయర్ పీఠంపై ఆసక్తి చూపుతోంది. కార్పొరేషన్‌గా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటుండటం.. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో అర డజను మంది బీజేపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికవుతూ వస్తుండటంతో ఈసారి మేయర్ పీఠంపై గురిపెట్టింది. జనసేనతో కలిసి ఎలాగైనా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా కదులుతోంది. వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గం నేత కావటి మనోహర నాయుడును తమ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపింది. పనిలో పనిగా తమ రాజకీయ చతురతను ఉపయోగించి అత్యధికంగా ఉన్న వైశ్య ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపార్టీకి చెందిన పాదర్తి రమేష్ గాంధీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ లేళ్ళ అప్పిరెడ్డికి కార్పొరేషన్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించగా, తూర్పు , పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళి గిరిధర్‌కు అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను వైసిపి అధిష్టానం అప్పగించింది. రాష్ట్ర హోం శాఖా మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులు నగరంలోనే ఏన్నో ఏళ్ళుగా నివాసముంటుండటంతో పార్టీ అధిష్టానం కార్పొరేషన్‌లో తమ అభ్యర్థులను గెలిపించేలా కృషిచేయాలంటూ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. గతంలో గుంటూరు పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డ కోవెలమూడి రవీంద్ర అలియాస్ నానిని మేయర్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం నాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంత నగరం గుంటూరు కావటంతో కార్పొరేషన్ ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగా ఒప్పందంలో భాగంగా అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు, రాయపాటి శ్రీనివాస్ కుమారుడు రాయపాటి మోహనసాయి కృష్ణ చెరి రెండున్నర సంవత్సరాలు మేయర్‌లు గా పదవిలో కొనసాగారు. అయితే ఈసారి బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరు కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో ఉన్నారు. గుంటూరు నగరంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటం, ముస్లిం, వైశ్య సామాజిక వర్గాలతో కన్నాకు మంచి పరిచయాలు ఉండటం, దీనికి తోడు జనసేన బీజేపీతో కలసి పనిచేస్తుండటం కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.గతంలో టిడిపిలో రాష్ట్రస్థాయిలో కీలక నేతగా వ్యవహరించి ప్రస్తుతం బిజెపిలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చందు సాంబశివరావును బరిలోకి దించాలన్న ఆలోచనతో ఉన్నారు. నగరంలో అత్యధికంగా ఉన్న బిసి ఓటర్లను ఆకట్టుకునేందుకు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దించేందుకు బిజెపి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా గుంటూరు కార్పొరేషన్‌లో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు

Related Posts