YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌లకు షాక్‌

బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌లకు షాక్‌

ఖాతాలు నిలిపివేసిన బ్యాంకులు

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఊహాజనిత కరెన్సీ బిట్‌కాయిన్‌. ఇప్పటికే బిట్‌కాయిన్‌ ట్రేడర్లకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ట్రేడింగ్‌ చేసిన వేలాది మందికి పన్ను కట్టాల్సిందిగా నోటీసులు పంపించింది. తాజాగా.. బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌లు చేస్తున్న కంపెనీల బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు సమాచారం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంకులు బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌లు జరుపుతున్న వారి ఖాతాలను నిలిపివేసినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచురించింది. భారత్‌లో జబ్‌పే, యునోకాయిన్‌, కాయిన్‌ సెక్యూర్‌, బటెక్స్ ‌ఇండియాతో పాటు పలు ప్లాట్‌ఫాంలు బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ నిర్వహిస్తున్నాయి. బిట్‌కాయిన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఖాతాల నుంచి నగదు ఉపసంహరణను కూడా బ్యాంకులు నిలిపివేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ విషయంపై యునోకాయిన్‌ స్పందించింది. బ్యాంకుల దగ్గర నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని యునోకాయిన్‌ ప్రమోటర్‌ సాత్విక్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు సమాచారం. ‘బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌లు చేస్తున్న బ్యాంకు ఖాతాలను నిలిపివేయాల్సిందిగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి మాకు ఎటువంటి సూచనలు రాలేదు. ఇది మేమే ముందుస్తుగా తీసుకున్న చర్యలు. ఇటువంటి ఖాతాల వల్ల ఆందోళన చెంది ముందుగానే లావాదేవీలను నిలిపివేసినట్లు’ ఓ బ్యాంకర్‌ వెల్లడించారు.

భారత్‌లో టాప్‌ టెన్‌ బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ల మొత్తం ఆదాయం సుమారు రూ.44వేల కోట్లు ఉన్నట్లు ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ చేసిన వేలాది మందికి పన్ను కట్టాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిట్‌కాయిన్‌, క్రిప్టో కరెన్సీలు భారత్‌లో చట్టబద్ధం కావని, వాటి చెలామణికి ఎటువంటి హామీ లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వశాఖ, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా పలుమార్లు మదుపర్లను హెచ్చరించింది.

Related Posts