YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్సీల  చేరికతో మనస్సు మారేనా

ఎమ్మెల్సీల  చేరికతో మనస్సు మారేనా

ఎమ్మెల్సీల  చేరికతో మనస్సు మారేనా
విజయవాడ, ఏప్రిల్ 1
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వరసగా టీడీపీకి రాజీనామాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు కావడం విశేషం. అయితే వీరంతా వైసీపీలో చేరుతుండటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శాసనమండలి రద్దు విషయంలో జగన్ పునరాలోచించుకుంటారని భావించి వీరు వైసీపీలో చేరుతున్నారన్న టాక్ విన్పిస్తుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పే కొందరు వైసీపీ కండువా కప్పుుకుంటున్నారన్న ప్రచారమూ ఉంది.నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ 151 సీట్లతో శాసనసభలో బలంగా ఉంది. అయితే శాసనమండలిలో మాత్రం టీడీపీ మెజారిటీతో ఉంది. ఛైర్మన్ కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో అక్కడ బిల్లులను అడ్డుకోవడం టీడీపీ మొదలు పెట్టింది. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను కూడా శాసనమండలి వ్యతిరేకించింది.అయితే శాసనమండలిని రద్దు చేస్తారని టీడీపీ కూడా ఊహించలేదు. భవిష్యత్తులో శాసనమండలిలో ఖాళీ అయ్యే సీట్లన్నీ వైసీపీకే వెళతాయి. అందుకోసం జగన్ మండలిని రద్దు చేసే సాహసం చేయరని చంద్రబాబు కూడా అంచనా వేశారు. కానీ శాసనమండలిని జగన్ రద్దు చేశారు. అయితే అది పార్లమెంటు పరిధిలో ఉండటంతో ఎమ్మెల్సీల్లో ఎక్కువ ఆందోళన కన్పిస్తోంది. తాము ఎక్కువ మంది పార్టీలో చేరితే వైసీపీ బలం పెరిగి మండలి రద్దు ప్రతిపాదనను విరమించుకుంటారని టీడీపీ ఎమ్మెల్సీలు అంచనా వేశారు.అందుకే తొలుత డొక్కా మాణిక్య వరప్రసాద్ తో మొదలయిన వ్యవహరం తర్వాత ఊపందుకుంది. పోతుల సునీత, శివనాధ్ రెడ్డి, శమంతకమణిలు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. తాజాగా కేఈ ప్రభాకర్ కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన ఇంకా వైసీపీలో చేరలేదు. మరికొందరు ఎమ్మెల్సీలు సయితం వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అలాగైనా జగన్ మనసు మారి శాసనమండలి రద్దు ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటారన్నది వారి ఆశ. అయితే ఒకసారి జగన్ నిర్ణయం తీసుకుంటే మళ్లీ వెనక్కు వెళ్లరు. మరి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు వస్తే ఆ ప్రతిపాదనను విరమించుకుంటారేమో? చూడాలి.

Related Posts