YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత మరుగుదొడ్లలో అవినీతి కంపు

వ్యక్తిగత మరుగుదొడ్లలో అవినీతి కంపు

వ్యక్తిగత మరుగుదొడ్లలో అవినీతి కంపు
ఒంగోలు, ఏప్రిల్ 9
ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించి స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే మహోన్నతమైన ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఆ ఆశయానికి  నాయకులు తూట్లు పొడిచారు. వారి అక్రమ వ్యవహారాలకు వ్యక్తిగత మరుగుదొడ్లనూ వదిలిపెట్టలేదు. నిర్మాణం పూర్తి చేయకుండానే మరుగుదొడ్ల బిల్లులు బొక్కేశారు. కొందరు సొంత డబ్బులతో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కార్యాలయాల చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.స్వచ్ఛభారత్‌ పథకంలో నిర్మించిన మరుగుదొడ్లలో అంతులేని అవినీతి జరిగింది. గ్రామ, మండల స్థాయి నాయకులు, అధికారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకున్నారు. పలుచోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. గుంతలు, తలుపులు, సెప్టిక్‌ ట్యాంకులు లేని అరకొర నిర్మాణాలతో బిల్లులు నొక్కేశారు. అప్పట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా మంది లబ్దిదారులు ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అధికార పార్టీ నాయకులు పనులు చేస్తామని అవినీతికి తెరలేపారు. బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల పంచాయతీలోని చెన్నుపల్లి, బార్లకుంట, శింగరపల్లి, బాలీశ్వరపురం గ్రామాల్లో 215 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. 85 శాతం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి గుంతలు తీసి రింగులు వేశారు కానీ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి కొన్నిచోట్ల నిర్మాణ పనులే మొదలు పెట్టలేదు. అసలు లబి్ధదారులకు తెలియకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. పాతవాటిని కొత్తగా చూపించారు. దొరికినకాడికి దోచుకుని పంచుకు తిన్నారు.కోనపల్లె పంచాయతీలోని పోగుళ్లలో పూరిపాకల్లో జీవనం సాగిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పక్కా గృహం లేదు. 45 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. పొడవు, వెడల్పు తక్కువగా, లోతు తక్కువగా గుంత తీసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో ఒక్కరు కూడా వ్యక్తిగత మరుగుదొడ్డిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. అవి నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు ఖర్చుపెట్టిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాంట్రాక్టర్‌ జేబులు నింపడానికే పథకం ఉపయోగపడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పంచాయతీల్లో రూ.25 లక్షలుపైగానే అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related Posts