కృష్ణా జిల్లాలోనే రాజధాని ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రోడ్లను ఆధునీకరిస్తున్నా పలు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు సమాచారం. రద్దీ ఉన్న ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, సర్వీసు రహదారులను ఏర్పాటుచేయడంలేదని స్థానికులు అంటున్నారు. ప్రధానంగా బందరు రహదారి విస్తరణలో ఈ తరహా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. విజయవాడ నగరం, వివిధ పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల మీదుగా వెళుతున్న ఈ జాతీయ రహదారికి సర్వీసు రహదారులు లేకపోవడం ప్రధాన లోపం. సర్వీసు రహదారులు లేకుండానే విస్తరించడం ప్రమాదమేనని జిల్లా యంత్రాంగం జాతీయ రహదారుల సంస్థకు లేఖ కూడా రాసింది. ఏప్రాంతంలోనైనా జాతీయ రహదారులు విస్తరిస్తున్నప్పుడు అక్కడి గ్రామాల మీదుగా రోడ్డు ఉంటే సర్వీసు రహదారులు కూడా నిర్మిస్తారు. ఈ రోడ్ల వల్ల ట్రాఫిక్ ప్రధాన రహదారిపైకి రాకుండా సర్వీసు రహదారుల వెంట వెళ్తుంది. వాహనాల రద్దీ విపరీతంగా లేకుండా చేసేందుకు ఆయా గ్రామాల్లో అండర్ పాస్‌లు నిర్మిస్తారు. అయితే బందరు రహదారిలో ఇలాంటి సర్వీసు రహదారలు ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు చెప్తున్నారు. అమరావతి రాకతో విజయవాడ నగరం విస్తరించింది. శివారు ప్రాంతాల్లో విపరీతంగా జనాభా పెరగడంతోపాటూ ఇళ్ల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. పలు ఆఫీసులూ ఇక్కడ కొలువుదీరాయి. పైగా విద్య, వాణిజ్య ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. బందరుకు ఓడరేవు, పారిశ్రామిక నడవ మంజూరు అయ్యాయి. దీంతో త్వరలోనే ఎగుమతులు, దిగుమతులు భారీగా జరగనున్నాయి. భవిష్యత్తులో పారిశ్రామికంగా మచిలీపట్నం కీలకంగా మారనుండడంతో ఈ రహదారికి ప్రాధాన్యం పెరిగింది. ఇటీవల కాలంలో విజయవాడతో పాటు, శివారు ప్రాంతాల వరకు ట్రాఫిక్ పెరగడంతో 65 కి.మీ దూరం ప్రయాణించాలంటే రెండు గంటలకు పైగానే పడుతోంది. ఇక రద్దీ సమయాల్లో అయితే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం జరగాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.