YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

సోషల్ మీడియాలో షేర్ చేస్తే వేటే

సోషల్ మీడియాలో షేర్ చేస్తే వేటే

సోషల్ మీడియాలో షేర్ చేస్తే వేటే
హైద్రాబాద్, మే 20,
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో నగర వాసులు ఇండ్లను వదలడం లేదు. దాంతో సోషల్‌ మీడియాకు మరింత ప్రాధానత్య పెరిగింది. ప్రతి రోజు వందల కొద్ది వీడియోలు, వివిధ సమాచారం, కథలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అధిక శాతం మెయిల్స్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌మీడియాలో వచ్చే వీడియోలను వీక్షించడం, వార్తలను, కథనాలను చదవడం చేస్తున్నారు. కొందరైతే అందులో ఏముందో పూర్తిగా చూడకుండానే తానే ముందుగా షేర్‌ చేయాలనే తపనతో వాటిని ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుడు కథనాలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కొన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవీ ఉంటున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండకుంటే ఎలాంటి తప్పు చేయకపోయినా కటకటాలు లెక్కించాల్సిందే...కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సోషల్‌ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలపై పోస్టింగ్‌లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజల్లో భయాందోళనలు, విధ్వంసాలు సృష్టించే పోస్టింగులపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు.నకిలీ పోస్టింగులపై పోలీసులు ఎప్పటికప్పుడు సుమోటోగా కేసులు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 50కిపైగా కేసులను సుమోటోగా కేసులను స్వీకరించి నిందితులను అరెస్టు చేశారు. అందులో ఒకటి ట్విట్టర్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన ఓ వ్యక్తిపై కేసు నమోదుచేశారు. కరోనా ఫండ్‌ పంపించాలంటూ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించిన వారి ఆటకట్టించారు. మద్యం సరఫరా చేస్తామని డబ్బులు దండుకున్న వారిపై కేసులు నమోదు చేశారు.నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా కొందరు యువకులు ప్రయత్నించారు. ఎప్పుడో ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను తాజాగా మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేసిన సంఘటనలు కోకోల్లలు. ఢిల్లీలో నిజాముద్దీన్‌లో తబ్లిక్‌-ఇ-జిమాతేలో చీఫ్‌ మౌలానా కరోనా వైరస్‌ను 70 వేల మంది భారతీయులకు అంటించగలిగితే భారత దేశంలో అల్లకల్లోలం జరుగుతుందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పతనమై మనం అనుకున్నది సాధించవచ్చంటూ ఆదేశాలిచ్చారని.. ఇష్టానుసారంగా పోస్టులను తయారు చేసి వాటిని గుర్తుతెలియని వ్యక్తులు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా, మతకలహాలను సృష్టించే విధంగా ఉన్న ఈ పోస్టింగ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మరికొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ఫొటోలతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు దేశాల మధ్య వైరం పెరిగే విధంగా విడియోలను మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెడుతున్నారు.పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్‌ 6న ముగుస్తున్నాయంటూ వాట్సాప్‌ల్లో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఒక డాక్యుమెంట్‌ను తయారు చేసి, అది ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగా షేర్‌చాట్‌, వాట్సాప్‌లో పోస్టు చేసి సర్క్యులేట్‌ చేశారు. మద్యం విక్రయాలపై ప్రభుత్వం జిఒను తీసుకొచ్చిందని వైరల్‌ చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వం వివిధ జిఒలను జారీ చేసినట్టు పలు పోస్టింగులు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి వారిపై సిసిఎస్‌ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ఇప్పటికే రెండు నెలల కాలంలో 50కిపైగా కేసులు నమోదు చేశారు. ఇలా ప్రతిరోజు ఏదో వీడియో వైరల్‌ కావడం సర్వసాధారణంగా మారింది. అయితే ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.ఏదైనా వీడియోను మార్ఫింగ్‌ చేసినా, ఇతరులను కించపరిచే విధంగా సృష్టించినా, లేక ఎవరైనా దాన్ని మీకు పంపించిన పక్షంలో దాన్ని మీరు ఫార్వర్డ్‌ చేయడం, లైక్‌ కొట్టడం చేస్తే చట్టప్రకారం నేరం చేసిన వారవుతారని సిసిఎస్‌ పోలీసులు తెలిపారు. మాకు తెలియదని చెప్పిన్నంత మాత్రాన తప్పించుకోలేరన్నారు. ఫార్వర్డ్‌ చేసిన వారితోపాటు ఆ గ్రూప్‌ అడ్మిన్లపై కేసులు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని సిసిఎస్‌ పోలీసులు హెచ్చరించారు.

Related Posts