YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్లక్ష్యం నీడన పశుసంరక్షణ!

నిర్లక్ష్యం నీడన పశుసంరక్షణ!

వ్యవసాయంతో పాటూ రైతులు పాడి పశువులు పెంచుకుంటే వారికి కొంత ఆదాయం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రైతులు పాడిపశువులు పెంచుకునేలా ప్రోత్సహిస్తోంది. మరోవైపు పశు సంరక్షణకూ ప్రాధాన్యతనిస్తూ సంబంధిత వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ఈ తరహా సేవలు పూర్తిస్థాయిలో ఉండడంలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సిబ్బంది కొరతే కారణమని అంటున్నారు. పలు ప్రాంతాల్లో పశువైద్యాధికారులు లేకపోవడంతో రైతులు పశువులను వైద్యులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి వైద్యం చేయించాల్సి వస్తోంది. వైద్యం కోసం పశువులు కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడం మరో సమస్య. అనారోగ్యంగా ఉన్న మూగజీవాలు కిలోమీటర్ల మేర దూరం నడుస్తూ అలసిపోతున్నాయి. అంతేకాక వాటి సమస్యలు మరింతగా తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో 27 పశువైద్యాధికారుల పోస్టులు మంజూరు చేశారు. మొత్తం 18 మండలాల్లో వీరు సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంతవరకూ బాగానే మంజూరైన 27పోస్టుల్లో 19 మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన చోట్ల భర్తీ జరగడంలేదు. 

పశువైద్యాధికారుల పోస్టుల భర్తీ అసంపూర్తిగా ఉండడం జిల్లాలో సమస్యాత్మకంగా మారింది. దీనికి తోడు రిటైర్ అయిన వారి స్థానంలోనూ కొత్తవారిని నియమించలేదు. దీంతో జిల్లాలో పాడిపశువులకు సమర్ధవంతమైన వైద్య సేవలు అందని పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోవడం పశువులను కబేలాలకు తరలించడానికి ఓ కారణమని రైతులు చెబుతున్నారు. మరోవైపు దశాబ్దాల కిందట నిర్మించిన పశువైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి చాలా చోట్ల పాత పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. అసౌకర్యంగా ఉండడంతో వైద్య సేవలకు ఇబ్బందిగా ఉంటోంది. పెరుగుతున్న పశుసంపదకు అనుగుణంగా ఆసుపత్రుల సంఖ్య పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యసేవలు పూర్తి స్థాయిలో లేనందున తమకు, మూగజీవాలకు ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు. ఆసుపత్రులు లేని చోట ప్రస్తుతం గోపాల  మిత్రలే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారిని దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం మరిన్ని సేవలను విస్తరించేలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts