YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శక్తి-యుక్తి*

శక్తి-యుక్తి*

శక్తి-యుక్తి*
శారీరక బలానికి సంబంధించినది శక్తి. బుద్ధిబలానికి సంబంధించినది యుక్తి. మనిషికి ఈ రెండూ అవసరమే! సత్యం, ప్రేమ, న్యాయం... వీటిని పాటించడానికి ఎంతో గుండెబలం అవసరం. కష్టాలను ఓర్చుకొనే శక్తిని ఇమ్మని మహాత్ములు సైతం భగవంతుణ్ని ప్రార్థిస్తుంటారు. పూర్వపురుషులకు మంత్రశక్తి ఉండేది. ఆధునిక మానవుడికి యంత్రశక్తి ఉంది. సంసారం ఒక మహా సాగరం. ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా ఆ సాగరంలో దిగాడంటే కష్టాలు అనే మొసలి బారిన పడక తప్పదు. అప్పటిదాకా తనంతటివాడు లేడనే ధీమాతో బతికినవాడూ కష్టకాలంలో ఎవరైనా సహాయం చేస్తారేమో అని దీనంగా దిక్కులు చూస్తూ విలపిస్తుంటాడు- గజేంద్రుడిలా. ఆపద నుంచి తప్పించుకోవడానికి తన శక్తినంతా ప్రయోగించి చూస్తాడు. కాలం గడిచేకొద్దీ బలహీనుడైపోతాడు. దేవుడు గుర్తుకొస్తాడు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఊరు ఏమిటో, పేరు ఏమిటో తెలియదు. ఈ లోకాల పుట్టుకకు కారణం ఎవరు, చావులకు మూలం ఎవరు, చివరకు ఏమవుతుంది... ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. బలహీనులకు రక్షకుడు ఆ భగవంతుడే అని గ్రహించేలోపు సమయం మించిపోవచ్చు! ఏ ప్రాణికైనా దేహశక్తికి పరిమితి ఉంటుంది.ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే శక్తి త్రయం పురుషుణ్ని మహా పురుషుడిగా తీర్చిదిద్దుతుంది. అమ్మవారిని శక్తిగా భావించి పూజిస్తాం. పార్వతి పరబ్రహ్మస్వరూపిణి, పరాశక్తి. వారి స్వరూపాలను దేవతా మూర్తులుగా భావిస్తాం. ఎంత దేహశక్తి ఉన్నప్పటికీ ఒకనాటికి అది అంతా క్షీణించిపోక తప్పదు. పోరాటంలో బలహీనుడి చేతిలో బలవంతుడు ఓడిపోవచ్చు. లోకానికి మేలుచేద్దామని ప్రయత్నించిన వాళ్లనెందరినో దుష్టులు పొట్టన పెట్టుకున్నారు. శక్తితో సాధించలేనిది యుక్తితో సాధించవచ్చు. ఒక్కోసారి రెండూ అవసరం కావచ్చు. తమ శక్తియుక్తుల్ని చూసుకొని ఎవరూ గర్వించకూడదు. ఎందుకంటే అవి ఏ ఒక్కరి సొమ్ముగాదు. ‘నేను బలవంతుడిని... నాకు ఎవరూ లెక్కలేదు’ అనుకొంటూ పలువురితో కలహించకూడదు. అది మేలు కాదు. గొప్ప బలంగల పాము కూడా చలిచీమల చేతిలో చిక్కి చస్తుందిగా!’ అంటుంది సుమతీ శతకం.యుక్తి కంటికి కనిపించదు. కండబలం కళ్లకు కనిపిస్తుంది. కోడి రామమూర్తి వంటివారు స్వయంకృషితో శారీరక బలం సంపాదించి, ప్రపంచ బలశాలురలో ఒకరిగా ఖ్యాతిగాంచారు. తెలుగుజాతికి వన్నె తెచ్చారు. ప్రయత్నిస్తే శారీరక బలం పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. ఒక బాలుడు చిన్నప్పుడు సదా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒక రోజు అతడు తండ్రి వెంట కుస్తీ పోటీలు చూడటానికి వెళ్ళాడు. అక్కడ కుస్తీ పడుతున్నవారి శరీర ఆకారాలను, వారి బలాన్నీ చూసి ఆశ్చర్య పోయాడు. ‘నాన్నా! నేను కూడా అలా తయారు కావాలంటే ఏం చేయాలి?’ అని ఆ బాలుడు తండ్రిని అడిగాడు. తండ్రికి ఆశ్చర్యం వేసింది. జాలీ కలిగింది. ‘నాయనా! ముందుగా అలాకావాలనే గట్టి పట్టుదల కావాలి. మార్గాలు అవే తెలుస్తాయి! నేను చేయగలిగింది నీకు బలవర్ధకమైన ఆహారం పెట్టడం మాత్రమే! నిత్యం వ్యాయామం చేయడం నీ వంతు!’ అన్నాడు కుమారుడి తల నిమురుతూ. నాటినుంచి ఆ బక్క బాలుడు తన దృష్టినంతా దేహంపైనే కేంద్రీకరించాడు. అనతి కాలంలోనే అతడి కోరిక నూరుశాతం ఫలించింది. ఒళ్ళంతా కండలు తిరిగింది. ఆ బాలుడే తరవాతి కాలంలో యూనేజ్‌ శాండోగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 
 

Related Posts