YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పరబ్రహ్మ స్వరూపం.....

పరబ్రహ్మ స్వరూపం.....

పరబ్రహ్మ స్వరూపం.....
మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసుకొన్నాను అనుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంత చెప్పినా అది పూర్తి అవ్వదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారి కోసం కొంత విషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరం తోటి, అంతఃకరణాల తోటి జీవిస్తున్నాం కాబట్టి.. ఈ అజ్ఞానం తొలగేవరకూ కొంచెం ప్రాపంచికమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాల తోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి.
దాని సంగతి తెలిసిన పిమ్మట, దాని కోసం ఉపయోగించిన ప్రాపంచిక విషయాలను వదలి వేసి, పరిపూర్ణమైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే..
"సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం. కొన్ని వివరణలు...
ఈశావాశ్యోపనిషత్...
1) పరమాత్మ ఒక్కటే చలన రహితమైనది. అయినా మనస్సు కంటే మహావేగము కలది. మనసు కంటే ముందే వెళ్ళుట వలన అది ఇంద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటిపోవుచున్నది. ఆత్మసాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతములగుచున్నవి.
పైన చెప్పినట్లు.. ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగా ఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈజీవులన్నియూ చైతన్యవంతములై తమ తమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.
2) ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వవ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల కూడా ఉన్నది. 
పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈవిధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరం గానూ, దగ్గర గాను ఎలా వుంటుంది.. అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలావున్నాము.. చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరికొకరు వ్యతిరేక దిశలో కూర్చుంటే ఎలావున్నట్లు.. ఎంత దూరంలో వున్నట్లు.. ఒక్కసారి ఆలోచించండి..!
అలాగే మనం పరమాత్మవైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో.. "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" ..అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి  వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని...

|| ఓం నమః శివాయ ||

వరకాల మురళీమోహన్ సౌజన్యంతో 

Related Posts