YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణం కోసం రణం తప్పేనా?

రుణం కోసం రణం తప్పేనా?

2018-19 సంవత్సరానికి పంట రుణాల టార్గెట్‌పై బ్యాంకర్లు నిర్ణయానికి వచ్చారు. వ్యవసాయంతో పాటూ అనుబంధ రంగాలకు రూ.1829కోట్లు అందివ్వాలని నిర్దేశించుకున్నారు. ఈ మొత్తంలో రూ.1473కోట్లు వ్యవసాయానికి, రూ.356కోట్లు ఇతర అనుబంధ రంగాలకు కేటాయించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కొత్తగా నిర్దేశించుకున్న రుణాలను రైతులకు అందించనున్నారు. ఇదిలాఉంటే పంట రుణాలకు నిర్దేశించిన మొత్తం బాగానే ఉన్నా వివిధ కారణాల వల్ల రైతులకు ఆర్ధిక చేయూత లభించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. సకాలంలో రుణం అందకపోవడమే దీనికి కారణం. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని నష్టాలపాలవుతున్నారు రైతులు. మరోవైపు పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కడమూ కష్టంగానే ఉంటోంది. ప్రభుత్వం కొనుగోళ్లు నిర్వహిస్తే సరేసరి. లేదంటే అన్నదాతలకు సమస్యలే ఎదురవుతున్నాయి. కారు చవకగా పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాని దుస్థితి. ఈ సమస్యలన్నీ తొలగాలంటే బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అలా జరిగితే జిల్లా రైతులకు కొండంత అండగా ఉన్నట్లవుతుంది. 

వర్షాకాలం పంటకు సంబంధించి జూన్‌లో రుణాల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలి. జూన్ నుంచి ఆగస్టులోగా పంపిణీ పూర్తిచేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇటు పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయానికి ఆర్ధిక ఆదరువు లభించడంతో పాటు అటు పంటబీమా ప్రీమియం సైతం గడువులోగా చెల్లించినట్లవుతుంది. అయితే బ్యాంకులు ఈ దిశగా ఆలోచించడంలేదు. ఖరీఫ్‌ చివరి వరకు రుణాలు ఇస్తుండడంతో అన్నదాతలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయిననప్పటికీ రుణాలు ఇవ్వడంపై అనాసక్తి ఉంటోంది. దీంతో డెయిరీలు ఏర్పాటు కావడం లేదు. రాయితీలు, రుణాలు లేకపోవడంతో కోళ్ల, పాడి పరిశ్రమపై స్థానికులు ఆసక్తి చూపడంలేదు. భారీ పెట్టుబడి పెట్టేందుకు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి అభివృద్ధికి పశుసంవర్ధకశాఖతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు రూపొందించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయమై ఇటు శాఖ పరంగా చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు బ్యాంకుల రుణ ప్రణాళిక సైతం కాగితాలకే పరిమితమవుతోంది. రుణాల మంజూరులో వివిధ నిబంధనలు ఔత్సాహికులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఏదేమైనా  వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు నిర్దేశించిన రుణాలకు సకాలంలో మంజూరు చేసి అండగా ఉండాలని బ్యాంకర్లకు రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts