YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మల్బరీ సాగు బహుమేలు

మల్బరీ సాగు బహుమేలు

సంప్రదాయ పంటలతో రైతాంగం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించలేకపోతోంది. వివిధ స్థాయిల్లో ఆశాజనక పరిస్థితులు లేకపోవడంతో రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాక నానాపాట్లు పడుతున్నారు. దీంతో ఇతర లాభదాయక పంటలు పండించేలా రైతులను చైతన్యపరుస్తోంది ప్రభుత్వం. వివిధ ప్రోత్సహకాలు సైతం అందిస్తూ రైతులకు చేదోడుగా ఉంటోంది. దీంతో పలువురు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి లాభసాటిగా ఉండే పంటలు పండిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో సైతం పలువురు రైతులు మల్బరీ సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టు పురుగుల పెంపకం ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారు. మల్బరీ సాగు చేపట్టినవారి ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడడంతో పలువురు రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు జిల్లాలో సుమారు 90ఎకరాలకే పరిమితమైన ఈ పంట ప్రస్తుతం 194 ఎకరాలకు చేరిందని అంటున్నారు. 

మల్బరీ సాగుతో నష్టాలు తక్కువే. రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడితో సంవత్సరానికి అధిక ఆదాయం పొందే వీలుంది. అంతేకాక రైతులకు, కూలీలకు సంవత్సరం పొడుగునా పని దొరుకుతుంది. పైగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుండడంతో రైతులు ఈ పంటపై దృష్టి సారించారు. పాల్వంచ, బూర్గంపాడు, అశ్వాపురం, చుంచుపల్లి, పినపాక, దుమ్ముగూడెం, ములకలపల్లి మండలాల్లో మల్బరీ సాగు ఎక్కువగా ఉంది. మల్బరీ సాగుకు ఉపాధి హామీ పథకం, ఎస్సీ సబ్ ప్లాన్‌ల నుంచి ప్రోత్సహాలు ఉన్నాయి. దీంతో వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు దీనిని ఎంచుకుంటున్నారు. ఒక కిలో పట్టు గూళ్లకు ప్రభుత్వం రూ.75 అందిస్తుంది. ఈ పంట సాగు మరింతగా విస్తృతమైతే బాగుంటుందని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు. కర్షకుల ఆర్ధిక స్థితిగతులు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts