YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పోచారం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పోచారం
కామారెడ్డి : రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించి, రైతుల బ్రతుకులను బాగు చేయాలనే సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి మన కేసిఆర్. రైతుకు ఎకరాకు రూ. 4000 అందిస్తున్న ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం నాడు భిక్నూర్ మండలం గుర్జకుంట గ్రామంలో “రైతు బంధు” పథకం అమలులో బాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంపై అవగాహన సభను అయన నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నిజాం హయంలో భూరికార్డుల సర్వే జరిగింది. 86 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి దైర్యంచేసి తిరిగి సమగ్రంగా భూరికార్డులను ప్రక్షాళన చేసి రికార్డులను సమర్ధవంతంగా తయారుచేయించారు. వివాదాలు లేని భూరికార్డులను సరిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే, కొన్నిచోట్ల రికార్డులను ఇంకా పెండింగులో ఉంచడం శోచనీయమని అన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీకి రెవిన్యూ రికార్డులే ప్రామాణికం, కాబట్టి రెవిన్యూ అధికారులు తమ పరిధిలోని భూముల వివరాలను సరిగ్గా నమోదుచేయాలని సూచించారు. ఎవరైనా అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాకు ఎవరిపైనా కోపం లేదు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వానికి ముఖ్యం. అధికారులు ప్రజలతో స్నేహపూరిత వాతావరణంలో ఉండాలని అన్నారు. అప్పు అవసరం లేకుండా, అధిక వడ్డీ కోసం ప్రవేటు వ్యాపారులను ఆశ్రయించకుండా రైతుకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. దీనికోసమే ప్రతీ సీజన్లో ఎకరాకు రూ. 4000 ను ముందస్తు పెట్టుబడిగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి పండగ వాతావరణంలో చెక్కులను పంపిణీ చేస్తాం. చెక్కులను సులభంగా పంపిణీ చేయడానికి 15 కౌంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామంలోని రైతుల సంఖ్యను ఈ 15 కౌంటర్లకు సమానంగా కెటాయిస్తామని అన్నారు. గ్రామ సభ ప్రారంభం అయిన తర్వాత స్టేజి మీద నలుగురు, అయిదుగురు రైతులకు మాత్రమే చెక్కులు అందజేస్తారు. తదుపరి స్థానిక శాసనసభ్యుడు స్వయంగా ప్రతీ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ప్రతీ రైతుకు చెక్కును స్వయంగా అందజేస్తారని మంత్రి వెల్లడించారు. ఈ విధానంలో సమయం సద్వినియోగం అవడంతో పాటు, రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైతులు తమకు నచ్చిన బ్యాంకులలో చెక్కును మార్చుకోవచ్చు. పాత బకాయిలు ఎమైనా ఉంటే బ్యాంకు అధికారులు జమచేసుకోకుండా మొత్తం డబ్బులను రైతులకు అందిస్తారు. శాసనసభ్యుడు గ్రామం వదిలి మరో గ్రామ సభకు వెళ్ళినప్పటికి మండల, గ్రామ స్థాయి అధికారులు సభాస్థలిలోనే ఉండి మిగితా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని అయన అన్నారు. గ్రామ సభ కార్యక్రమంకు ముందే “మన వ్యవసాయం-మన తెలంగాణ” ను నిర్వహించాలి. వ్యవసాయ రంగానికి, రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యమైన కరంటు 24 గంటలు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుండి కృష్ణ, గోదావరి నదుల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. సాగుకు అవసరమైన ముందస్తు పెట్టుబడికై రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4000 అందిస్తున్నామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని విదంగా మద్దతు ధరకు ఉత్పత్తులను కొంటున్నాం.చరిత్రలో మొదటిసారిగా 2.70 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేశాం. అప్పుల ఊభి నుండి రైతులు బయటపడాలని మంత్రి సూచించారు.

Related Posts