YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పన్నులు కట్టలేదు సరికదా..

పన్నులు కట్టలేదు సరికదా..

2 లక్షల మందికి నోటీసులు.. అయినా ఒక్కరైనా స్పందిస్తేనా

నోటీసుల మీద నోటీసులు పంపినా చీమ కుట్టినట్టైన లేని ఎగవేతదారులు

నోట్ల రద్దు సమయంలో రూ.20 లక్షలకు పైబడిన పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన 2 లక్షల మందికి ప్రభుత్వం పన్ను నోటీసులను పంపింది. అయితే, ఏ ఒక్కరూ పన్నులు కట్టలేదు సరికదా.. ఆ నోటీసులకు కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ‘‘వారికి మేం చాలా ఎక్కువ సమయం ఇచ్చాం. వార్షిక రిటర్న్స్‌లో భాగంగా నోటీసులు అందుకున్న వారు ముందుకు వచ్చి పన్నులు కడతారని భావించాం. కానీ, వాళ్లు మా నోటీసులను పట్టించుకోనైనా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వారికి నోటీసుల మీద నోటీసులు పంపినా వారి నుంచి స్పందన శూన్యం’’ అని ఓ సీనియర్ ఆదాయ పన్ను అధికారి నిట్టూర్చారు.

పన్ను ఎగవేత దారులు పన్నులు ఎగ్గొట్టి దర్జాగా రోడ్లమీద తిరగకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ).. దేశవ్యాప్తంగా పన్ను రికవరీ చర్యలను ప్రారంభించింది. ఎగవేతదారులపై ఓ కన్నేసి ఉంచి పన్ను వసూళ్లకు వారి చుట్టూ తిరగాల్సిందిగా పలువురు అధికారులను సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర ఆదేశించినట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా నిజాయతీగా పన్ను చెల్లించే వారికి రివార్డులిచ్చేందుకు నిర్ణయించారని అంటున్నాయి. కాగా, పన్ను ఎగ్గొడుతున్న వారి వివరాలను పూర్తిగా సేకరించాక.. 2016 నోట్ల రద్దు సమయంలో రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తాలతో బ్యాంకుల్లో జమ అయిన 18 లక్షల అనుమానిత డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో 12 లక్షల డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ పోర్టల్ ద్వారా వెరిఫై చేశారు. ఆ వెరిఫైలో దాదాపు రూ.2.9 లక్షల కోట్ల అనుమానిత డిపాజిట్లు దాఖలైనట్టు తేలింది. మొత్తంగా ఐదు లక్షల డిపాజిట్లపై ఎవరూ వెరిఫికేషన్ కోసం రాలేదని తేలింది. దీంతో వారిని పక్కనపెట్టేసిన ప్రభుత్వం.. ముందు రూ.50 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసిన 70 వేల మంది వెనక పడింది. ఇప్పుడు అందులో భాగంగానే 20 లక్షలకు పైబడి డిపాజిట్లు చేసిన వారికి తాఖీదులిచ్చినా ఒక్కరూ కూడా స్పందించలేదు. ఆ తాఖీదులకు స్పందించని వారికి వ్యవస్థలపై ఉన్న నమ్మకం ఏపాటిదో ఈ ఉదంతమే ఉదహరిస్తుంది. 

Related Posts