YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై జనసేనాని ఫైర్

జగన్ పై జనసేనాని ఫైర్

విజయవాడ, ఆగస్టు 4
ఏపీలో అత్యాచారాలు, మహిళలపై దాడుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరుస ఘటనలపై జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని.. ప్రభుత్వ ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ లేదన్నారు.గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని శివాపురం తండాలో గిరిజన మహిళ రమావత్‌ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌ తో తొక్కించి హత్య చేయడం అమానవీయం అన్నారు పవన్. ఆ ఘటన గురించి తెలుసుకుంటే బాధ కలిగిందన్నారు. మృతురాలి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అటవీ భూమిని సాగు చేసుకొంటున్న ఆ గిరిజన కుటుంబంపై కిరాతకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజనులపై ఈ విధంగా దార్జన్యాలకు పాల్పడుతూ, అటవీ భూములను గుప్పెట పెట్టుకొంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు జనసేనాని. అధికార పార్టీ అండ ఉండటంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని.. ప్రజాస్వామ్యవాదులు, గిరిజన సంఘాలు ఈ సమస్యపై దృష్టిపెట్టాలి అన్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాగు వంతెన నిర్మాణపనుల దగ్గర పని చేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని తెలిసిందని.. భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు.మహిళకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా.. క్షేత్ర స్టాయిలో అమలు కావడం లేదన్నారు పవన్. ఇటీవల రాజమండ్రి దళిత మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటనను పవన్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ జరుగుతున్నాయని.. పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. దళిత వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.

Related Posts