YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణకు కలిసిరానున్న మూడు రాజధానులు

తెలంగాణకు కలిసిరానున్న మూడు రాజధానులు

హైద్రాబాద్, ఆగస్టు 8, 
తెలంగాణ రాజ‌కీయాల్లో ఇదే విష‌యంపై రాజ‌కీయంగా సాగుతుంది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటును నిశితంగా గ‌మ‌నిస్తున్న తెలంగాణ రాజ‌కీయ పార్టీలు, నేత‌లు.. ఈ ప‌రిణామం త‌మ రాష్ట్రానికి మేలు చేస్తుంద‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక‌, ఆది నుంచి కూడా ఏపీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను తమ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ‌కు ఈ ప‌రిణామాలు ఎలా లాభ‌మో.. చ‌ర్చ జోరుగానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఏపీకి మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న వెలువ‌డిన వెంట‌నే ఏపీకి రావాల్సిన కొన్ని ప‌రిశ్రమ‌లు తెలంగాణ‌కు త‌ర‌లి వెళ్లడంతో టీ మంత్రి హ‌రీష్‌రావు సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప‌రిణామాలు తెలంగాణ అభివృద్ధికి మ‌రింత ఊత‌మిచ్చేలా ఉన్నాయ‌ని చెప్పారు.నిజానికి ఏపీ సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు అన‌గానే తెలంగాణ‌లో కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు తెర‌మీదికి వ‌చ్చాయి. స‌ద‌రు విష‌యంపై అప్పటి నుంచి నిశితంగా గ‌మ‌నిస్తున్న సీఎం కేసీఆర్‌.. ఈ ప‌రిణామాన్ని త‌మ‌కు అనుకూలంగా ఎలా మ‌లుచుకోవాలా? అనే విష‌యంపై దృష్టి పెట్టారు. అయితే, అప్పట్లో తొంద‌ర‌లేద‌ని భావించారు. ముందు మూడు రాజ‌ధానుల విష‌యం తేల‌నీ.. త‌ర్వాత చూసుకుందాం.. అనుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఏపీలో మూడు రాజ‌ధానుల బిల్లు ఓకే కావ‌డంతో కేసీఆర్ ప్రస్తుత ప‌రిస్థితిలో పెట్టుబ‌డులు ఏపీకి వెళ్లే అవ‌కాశం లేద‌ని అంటున్నార‌ట‌. మూడు రాజ‌ధానుల ముచ్చట‌తో పెట్టుబ‌డి దారులు ఎక్కడ పెట్టుబ‌డులు పెడ‌తారు? ఏపీ ప్రభుత్వం వారిని ఎక్కడికి ఆహ్వానిస్తుంది? ఎలాంటి అవ‌కాశాలు ఇస్తుందో చూడాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశ‌మ‌ని ఆయ‌న అంటున్నట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదే విష‌యంపై ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.ఏపీలో ప‌రిణామాలు మ‌రింత తీవ్రమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, రాజ‌కీయంగా ఇప్పట్లో రాజ‌ధానిపై ర‌గ‌డ తేలే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేద‌ని, సో.. పెట్టుబ‌డులు అన్నీ కూడా ఏపీకి నిలిచిపోయే అవ‌కాశం ఉంద‌ని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ స‌హా క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌ జిల్లాల‌ను అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపించ‌డంతోపాటు పెట్టుబ‌డి దారుల‌కు సుగ‌మం అయ్యేలా కొన్ని మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేస్తే.. ఇక, త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని కూడా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. అయితే, వాస్తవానికి ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ రెండు జిల్లాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే ఉన్న పెట్టుబ‌డులు నిలిచిపోయాయి. ఈ క‌రోనా ప్రభావం త‌గ్గిన వెంట‌నే దేశ‌, విదేశాల పెట్టుబ‌డుదారుల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో స‌హా ఇత‌ర ప్రాంతాల‌కు ఆహ్వానించే దిశ‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రయ‌త్నాలు ప్రారంభించింది.ద‌క్షిణాదిలో చెన్నై, బెంగ‌ళూరు త‌ర్వాత హైద‌రాబాద్ పెట్టుబ‌డుల‌కు స్వర్గధామంగా నిలుస్తోంది. అయితే చెన్నై, బెంగ‌ళూరులో అనేకానేక స‌మ‌స్యలు పెరిగిపోవ‌డంతో ఇప్పుడు వీరి దృష్టంతా హైద‌రాబాద్ వైపే ఉంది. ఇదే అద‌నుగా కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సైతం అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ లాంటి న‌గ‌రాల్లో కూడా ద్వితీయ శ్రేణి కంపెనీల‌తో భారీ పెట్టుబ‌డులు పెట్టేలా చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నారు. ఏదేమైనా ఏపీలో గ‌త యేడాదిన్నర కాలంగా జ‌రుగుతోన్న ప్రతి అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే దిశ‌గా ముందుకు వెళుతోంద‌న్నది మాత్రం వాస్తవం.

Related Posts