YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానుల దిశగా అడుగులు స్వాతంత్ర సందేశంలో జగన్

మూడు రాజధానుల దిశగా అడుగులు స్వాతంత్ర సందేశంలో జగన్

విజయవాడ, ఆగస్టు 15, 
రాజ్యాంగం, చట్టం ప్రకారం వ్యవస్థలు నడిస్తేనే ఏ సమాజానికైనా మంచి జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తున్నానన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే రాజ్యాంగంలో ఉన్నదన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా, నామినేటెడ్ పదవుల్లో అన్ని కులాలకు స్థానం కల్పించకుండా, మహిళలకు సగం వాటా ఇవ్వకుండా, అధికార వికేంద్రీకరణ జరగకుండా, సామ్యవాదం, సమానత్వం కేవలం పుస్తకాలకే పరిమితమవుతాయన్నారు. రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ అని జగన్ చెప్పారు. సమన్యాయం జరిగేందుకే మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని జగన్ తెలిపారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని అని చెప్పారు. కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేయనున్నట్లు జగన్ తెలిపారు.పదమూడు జిల్లాల్లో ప్రజల మధ్య అడుగుల నుంచి పుట్టిన ప్రభుత్వం మనదని జగన్ అన్నారు. రాజ్యాంగంలోని మొదటిపేజీకి అర్థం చెబుతూ గత 14 నెలల పాలన సాగిందన్నారు. రైతు భరోసా, చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అమలు చేయగలిగామన్నారు. పేదలు ఇబ్బంది పడకూడదనే ఈ పథకాలను తీసుకువచ్చామనిచెప్పారు. రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల ప్రకారం కులం, మతం, ప్రాంతం వంటి కారణాలతో ఏ ఒక్కరూ అన్యాయానికి గురికాకూడదన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వలేనప్పుడు మనం సాధించిన ప్రగతి ఏంటని జగన్ ప్రశ్నించారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్నారు. భవిష‌్యత్ లో పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా నూతన విద్యావిధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు.వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేశామని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పధ్నాలుగు నెలల్లో మరో 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అవకాశం కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చామని జగన్ చెప్పారు. డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. చేయూత ద్వారా 23 లక్షలు, అమ్మఒడి ద్వారా 43 లక్షలు, 91 లక్షల మందికి సున్నావడ్డీ ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు. మద్య నియంత్రణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతులకు అన్నిరకాల ప్రయోజనాలు చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి ేస్తామని చెప్పారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. తాను ఇచ్చిన హామీల్లో అమలు కావాల్సినవి ఇక పదహారు మాత్రమేనని చెప్పారు.పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎప్పటికీ అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికిప్పుడు కేంద్రం తలొగ్గకపోయినా, భవిష్యత్తులో మన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పారు. అవినీతి లేని పాలన అందించడమే ముఖ్యమని చెప్పారు. త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమవుతుందని జగన్ చెప్పారు.

Related Posts