YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్కరకు వస్తున్న ఈ రక్ష

అక్కరకు వస్తున్న ఈ రక్ష

నెల్లూరు, ఆగస్టు 31
మనిషి జీవితంలో స్మార్ట్‌ ఫోన్‌ భాగమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌ లేనిదే క్షణం కూడా గడవలేని పరిస్థితికి వచ్చేశాడు. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విస్తృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు, ఆన్‌లైన్‌ షాపింగ్, వివాహ సంబంధాలు పేరిట, సోషల్‌ మీడియాలో పరిచయాలు పెంచుకుని మోసాలు, మహిళల గౌరవానికి భంగం కలిగేలా పోస్టింగ్‌లు, మొబైల్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్‌లను హ్యాక్‌ చేయడం, ఓఎల్‌ఎక్స్‌ పేరిట మోసాలు, వీడియో గేమ్‌ల పేరిట వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేయడం, ఆన్‌లైన్‌ లావాదేవీలు, లక్కీ డ్రాలు, లాటరీలు ఇలా.. ఎన్నో మోసాలకు సైబర్‌ నేరగాళ్లు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఈ–రక్షాబంధన్‌’ పేరుతో నిర్వహిస్తున్న వెబ్‌నార్‌ తరగతులు, అవగాహన సదస్సులకు అనూహ్య స్పందన వస్తోంది.  సైబర్‌ నేరాలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. వాటిని అధిగమించాలంటే మహిళల్లో అవగాహన అవసరమని రాఖీ పౌర్ణమి రోజున ‘ఈ–రక్షాబంధన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు, మహిళా కో–ఆర్డినేటర్లు, మహిళామిత్రలు, పోలీస్‌ అధికారులకు పోలీసుశాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా వెబ్‌నార్‌ తరగతులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. నేరుగా పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేలా ఆయా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. సైబర్‌ నేరాల నుంచి మహిళలు, బాలలకు రక్షణ  కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో హనీట్రాప్‌ పేరుతో బెంగళూరు కేంద్రంగా కొందరు సైబర్‌ నేరగాళ్లు పలు వెబ్‌సైట్లు, యాప్‌లలో అందమైన యువతుల ఫొటోలు పెట్టి ఆకర్షించారు. అమ్మాయిలతో ఫోన్‌ ట్రాప్‌ చేయించి ముగ్గులోకి దించి నగదు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ముఠాను సైబర్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఏటీఎంలో చోరీ జరిగిందని ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన క్రైం పోలీసులు.. ఢిల్లీ కేంద్రంగా ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని రెండు రోజుల కిందట అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌ల్లో పలువురు మోసగాళ్లు నకిలీ ఫ్రొఫైల్, ఫొటోలు, వివరాలతో ఎన్నారై సంబంధాల పేరిట చేస్తున్న మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. పెళ్లి సంబంధాల ముసుగులో పరిచయం చేసుకుని చాటింగ్‌ చేస్తూ..బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం, మార్ఫింగ్‌ చేయడం తదితర ఘటనలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. లింక్‌లు పంపించి గుర్తింపు దొంగతనం, ఆన్‌లైన్‌లో ఉద్యోగాలంటూ మనీ ట్రాన్స్‌ఫర్‌ మోసాలు, బ్యాంక్‌ల పేరిట నకిలీ వెబ్‌సైట్లతో మోసాలు ఇలా అడుగడుగునా సైబర్‌ నేరగాళ్లు మనల్ని ఉచ్చులోకి దింపి.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి.  

Related Posts