YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగుగంగకు నీటికళ

తెలుగుగంగకు నీటికళ

కడప, సెప్టెంబర్1 
 తెలుగుగంగ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు విడుదల చేసినా.. బద్వేలు, మైదుకూరు నియోకవర్గాల్లోని ఆయకట్టుకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చారు. గత ప్రభుత్వం అట్లూరు, పోరుమామిళ్ల, కలసపాడు, గోపవరం ప్రాంతాల్లోని ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు తదితర పనులకు కేవలం రూ. 50 కోట్లు కూడా విడుదల చేయలేదు. వైఎస్సార్‌ కడప జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన 2.133 టీఎంసీల సామర్థ్యం కలిగిన అనుబంధ రిజర్వాయర్‌(ఎస్‌ఆర్‌–1), 2.444 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్‌ఆర్‌–2ల తో పాటు 17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ను నీటితో నింపాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెండింగ్‌ పనులు పూర్తి కాకపోడంతో ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదు.  ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.రూ. 50 కోట్ల ఖర్చుతో పూర్తి చేయాల్సిన ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు పనులను  పెండింగ్‌లో పెట్టింది. మైదుకూరు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో 30వ కిలోమీటరు నుండి 45వ కిలోమీటరు వరకు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. కాశినాయన మండలంలో ఎనిమిది పిల్లకాలువల్లో కంపచెట్లు పెరిగాయి. పోరుమామిళ్ల చెరువునుండి ఎడమకాలువను కలిపే అప్రోచ్‌ కెనాల్‌ పనులు నిలిచి పోయాయి. పోరుమామిళ్ల బ్లాక్‌–9 పరిధిలో 9ఏకు సంబంధించి 3.7 కిలోమీటర్లు, చింతలపల్లి నుంచి మార్కాపురం మీదుగా ముద్దంవారిపల్లె వరకు జరగాల్సిన 1.7 కిలోమీటర్ల పనులు మొదలు కాలేదు. 9–బి బ్లాక్‌ పరిధిలో 2.5 కిలోమీటర్లు, చింతలపల్లి కాలువ కట్ట మీదుగా కట్టకిందపల్లి వరకు 2.5 కిలోమీటర్లు కాలువ పనులకుగాను 1.8 కిలోమీటర్లు పనులు జరగాల్సిఉంది. 9–బి బ్లాక్‌ పరిధిలో దమ్మనపల్లె నుంచి వీధుళ్లపల్లె మీదుగా రెడ్డికొట్టాల వరకు 7.8 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 3.2 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 9–ఎఫ్‌ పరిధిలో రామాయపల్లెవద్ద 8.5 కిలోమీటర్ల కాలువ పనులు  జరగాల్సి ఉండగా ఏడు కిలోమీటర్ల మేర పనులు వెక్కిరిస్తున్నాయి. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు  పనులు పూర్తిచేయాల్సి ఉన్నా అర్ధంతరంగా వదిలేశారు. ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు నిండి తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజుల్లో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరుతుంది. అయితే పనులు  పూర్తికాక పోవడంతో వైఎస్‌ హయాంలో పూర్తి చేసిన పనుల పరిధిలో 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పనులు పూర్తి చేసిఉంటే బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నదాతలు చెబుతున్నారు.

Related Posts