YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మాంగాడు కామాక్షి

మాంగాడు కామాక్షి

పార్వతీ దేవి పరమశివుని తన పతిగా పొందడానికై ప్రధమంగా తపస్సు చేసిన స్ధలం మాంగాడు.
ఇక్కడ , ఒకే స్ధలంలో ముగ్గురు దేవీలు  దర్శనం యిస్తున్నారు. ఒక ప్రక్కన  తపస్సు చేసుకునేస్థితిలోని కామాక్షి దేవి , విధులన్నింటినీ నిర్వర్తించే అనుచర దేవత  కుంకరి , మరొక ప్రక్క  గ్రామ దేవత దర్శనం  లభిస్తుంది.  మధ్యలో తపస్సు చేసుకునే భంగిమలో పార్వతీ దేవి భక్తుల మనసుని పరవశింప  చేస్తుంది.  పార్వతీ దేవి భగ భగ మండే జ్వాలలో, తన ఎడం కాలు పెద్ద వ్రేలిమీద ఆన్చుకుని, కుడి కాలు ముందుకు పైకి ఎత్తి  మడచిపెట్టి నిలబడి , శిరోజాలు నడుము వరకూ  భుజాలుమీదుగా వ్రేలాడగా  కుడి చేయి పైకెత్తి శిరస్సు  మధ్యగా చేతి వ్రేళ్ళు  రుద్రాక్ష మాలను పట్టుకుని, ఎడమ చేయి నాభికి ఎదురుగా  చిన్ముద్రలో, కను పాపలుపైకి చూస్తున్నట్లు , ఈశ్వర ధ్యానంలో దర్శనమిస్తుంది. ఏకదీక్షతో  తపమాచరించే పార్వతీదేవి దర్శన మాత్రముననే, మన పాపాలన్నీ  అగ్ని జ్వాలల్లో  భస్మమైపోతున్న భావం భక్తులలో  కలుగుతుంది .  తపమాచరించే పార్వతీదేవి మౌనం గా వుండగా, గర్భగుడిలో ఆది కామాక్షి  శాంత స్వరూపిణిగా దర్శనమిస్తుంది.
ఆది కామాక్షీదేవి ముందు  ఆదిశంకరాచార్యులవారు  ప్రతిష్టించిన  "అష్ట గంధం"  అనే ఎనిమిది మూలికలతో రూపొందించిన అర్ధమేరు శ్రీ చక్రం వుంది.  ఈ ఆలయంలోని ముఖ్యత్వం శ్రీ చక్రానికే యిస్తారు.  మూలికలతో తయారు  చేసినందు వలన  అభిషేకపూజలు చేయరు.  కుంకుమార్చన చేసి,పుష్పాల తోను, చందనం, పునుగు, జవ్వాదులతోను అర్చనలు చేస్తారు.  అభిషేకాది అలంకారాలు  అన్నీ ఆది కామాక్షీదేవి  విగ్రహానికి చేస్తారు.  గర్భగుడి ముందు నిలబడి ఆది కామాక్షి దేవిని, ఆది శంకరాచార్యులవారిని  దర్శించినంత మాత్రాన నే  మన మనోభిష్టాలు  నెరవేరుతాయని భక్తులు  విశ్వసిస్తారు.  మనసుకి నచ్చిన మహేశ్వరుని పరిణయమాడేందుకు  అమ్మ వారు తపస్సు చేసిన స్ధలమైనందున , మాంగాడు వివాహ భాగ్యాన్ని, మాంగల్య సౌభాగ్యాన్ని  అనుగ్రహించే  కల్పవల్లిగా కామాక్షి దేవిని  భక్తులు భావిస్తున్నారు. ఎన్నో మహిమలు చూపే యీ దేవి సన్నిధికి ఏడాదిపొడుగునా  భక్తులు అధిక సంఖ్యలో  యీ వస్తూ వుంటారు.  అగ్ని జ్వాలలలో అమ్మవారు తపస్సు చేయడానికి కారణమేమిటి?  ఆదిశంకరాచార్యులవారు  మూలికలతో చేసిన శ్రీ చక్రం గురించి తెలుసుకుందాము.  ఒకానొక సమయంలో పార్వతీదేవి వినోదంగా  ఈశ్వరుని రెండు  కన్నులను మూసింది. అంతే!  ప్రపంచ మంతా అంధకారమైపోయినది.  భూ భ్రమణం నిలిచి పోయింది.   ఇదంతా ఒక్క క్షణకాలంమాత్రమే. విభ్రమంతో  అమ్మవారు  తన చేతులను ఈశ్వరుని  కళ్ళ మీద నుండి  తీసివేసింది.  తెలియకుండా చేసిన తప్పు కి ప్రాయశ్చిత్తము కోసం  ఈశ్వరుడిని వేడుకొన్నది.  పరమేశ్వరుడు పార్వతిని భూలోకానకి వెళ్ళి  తపస్సు చేయమని  తగు సమయంలో తానే వచ్చి వివాహమాడుతానని  సందేశమిచ్చాడు.  ఆవిధంగా పార్వతీదేవి తపస్సు చేసుకోవడానికి  వచ్చిన స్ధలమే  మాంగాడు.  అక్కడ , తీవ్ర ఆవేశంతో అగ్ని జ్వాలలలో తపస్సు ఆరంభించింది.  ఒక శుభ ముహూర్తాన  పరమేశ్వరుడు అమ్మవారికి ప్రత్యక్ష మై కాంచీపురం కంబానది ఒడ్డున తపమాచరించమని  ఆదేశించాడు.  మాంగాడులో మొట్టమొదటగా తపస్సు  ఆరంభించినందు వలన  పార్వతీదేవి కి ఆది తప  కామాక్షి అనే పేరు వచ్చింది. కాంచీపురం కంబానది  తీరాన   పార్వతీదేవి ఇసుకతో ఒక శివలింగంచేసి తపస్సు చేస్తున్న సమయంలో నది కి వరద వచ్చింది.  వరదకి శివలింగం కొట్టుకు  పోకుండా అమ్మ వారు  శివలింగాన్ని గట్టిగా ఆలింగనముచేసుకుని  పట్టుకుంది.  ఆమె భక్తికి  మెచ్చి  పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను  చేపట్టాడు  పార్వతీదేవి కాంచీపురం  వెళ్ళినా, మాంగాడులో తపస్సు చేసుకునేందుకు తయారుచేసిన  అగ్ని మాత్రం  ఆరకుండా  ప్రజ్వరిల్లుతూనే వుంది. ఆ వేడికి అక్కడి ప్రజలు తల్లడిల్లగా ,పాడి పంటలు నాశనమైపోయాయి.  ఆ సమయంలో ఆది శంకరాచార్యులవారు  మాంగాడు ప్రాంతానికి విజయంచేశారు.  ఆ జ్వాలాశక్తి అమ్మవారి శక్తి గా తన జ్ఞాన దృష్టి తో గ్రహించి, అష్టమూలికలతో ,  తయారు చేసిన శ్రీ చక్రంలోకి ఆవాహన చేసి అర్ధమేరువుగా ప్రతిష్టించి శాంతపరిచారు.  వెంటనే భూమి మీది  వేడి చల్లారింది. తర్వాత  పైరు పంటలు బాగా పండాయి.  అమ్మవారి అనుగ్రహమైన శ్రీ చక్రందయతో  ఆ స్థలం సుభిక్షమయింది. ఇప్పటికీ మాంగాడు వెళ్ళే మార్గమంతా  పచ్చని పైరులతో నిండి  కన్నులపండువ చేస్తుంది.  చోళుల కాలంలో నిర్మించిన మాంగాడు కామాక్షి అమ్మవారి ఆలయం , విజయనగర  రాజుల కాలంలో  మరింత బాగా అభివృద్ది చెందింది.  తమిళ నాడు ఆలయాలన్నింటికంటే  మాంగాడు  ఆలయంలో వున్న బంగారు రధం ఎత్తు ఎక్కువ.  ఈ రధంమీద  కామాక్షీదేవి తో పాటు  లక్ష్మీ దేవి, సరస్వతీదేవి కూడా  ఊరేగింపు గా రావడం పవిత్రంగా ,అత్యంత రమణీయంగా, శోభాయమానంగా  వుంటుంది   మాంగాడు కామాక్షీదేవి ఆలయ పశ్చిమ గోడల మీద  విజయ నగర రాజుల శాసనాలు  ప్రత్యేకత కలిగి వుంటాయి.  మాంగాడుకు చెందిన ఆలయ భూమలు బయటవారికి  ఎవరికి విక్రయించకూడదని,  దానధర్మంగా ,   కానుకల రూపేణా కూడా ఎవరికీ  యివ్వకూడదని, శాసనాలలో  చెక్కబడి వున్నాయి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts