YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

టార్గెట్ పశ్చిమ బెంగాల్

టార్గెట్ పశ్చిమ బెంగాల్

కోల్ క‌త్తా, అక్టోబ‌రు 26, 
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కావడంతో ముఖ్మమంత్రి మమత బెనర్జీ ఆ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై వరస కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ కక్షలతోనే తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల మేరకే కేసులు నమోదు చేస్తున్నామని మమత బెనర్జీ ప్రభుత్వం చెబుతోంది.పశ్చిమ బెంగాల్ లో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ల మధ్యనే ఉంటుందని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. గత ఐదేళ్లలో బీజేపీ పశ్చిమ బెంగాల్ లో బాగా బలపడింది. మరో వైపు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బీజేపీ బలపడటంతో ఈ రెండు పార్టీలు బలహీన మయ్యాయన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు బీజేపీ రేసులో ముందుంది.మమత బెనర్జీ మోదీ ప్రభుత్వంపై తరచూ కాలుదువ్వుతుండటంతో కేంద్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాషాయజెండాను ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో ఎగరేయాలని భావిస్తున్న కమలం పార్టీ ఆ రాష్ట్ర పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పార్టీ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా ప్రత్యేక నిధులను కూడా కొన్నేళ్లుగా పంపిణీ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా అమిత్ షా, మోదీలు పశ్చిమ బెంగాల్ లో పాగా వేసి మమత బెనర్జీని దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నారు.మరోవైపు గవర్నర్ కూడా మమత బెనర్జీకి ఇబ్బందికరంగా మారారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ తరచూ ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ మమతను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో పోలీసులు రాజ్యమేలుతున్నారని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. గవర్నర్ కూడా బీజేపీకి ఇతోధికంగా తన వంతు సాయం చేస్తున్నారు. మొత్తం మీద మమత బెనర్జీ ఓట్ల వేటలో వీరందరిని తట్టుకుని ఎలా నిలబడుగలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts