YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ నుంచి విజయవాడకు రైల్వే జోన్

విశాఖ నుంచి విజయవాడకు రైల్వే జోన్

విశాఖకు పాలనా రాజధాని దేముడెరుగు, చూడబోతే ఉన్నది కూడా పోయేట్టుంది. రెండేళ్ళ క్రితం నరేంద్ర మోడీ సర్కార్ విశాఖకు రైల్వే జోన్ కేటాయించింది. అదిపుడు కదిలిపోయేలా ఉందని అంటున్నారు. నిజానికి రైల్వే జోన్ ఇచ్చారు కానీ బంగారు గని లాంటి వాల్తేర్ డివిజన్ని ముక్కలు చేసి పారేశారు. దేశంలోనే లాభసాటి డివిజన్ ని, వందల ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ని కాకుండా చేశారు. ఇక పేరుకు రైల్వే జోన్ అన్నారు కానీ కార్యకలాపాలు అయితే పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో పిడుగులాంటి వార్త ఏంటి అంటే విశాఖ నుంచి రైల్వే జోన్ ని కదిలించాలని చూస్తున్నారని. అదే నిజమైతే విశాఖకు షాక్ లాంటి పరిణామమే.విశాఖ రైల్వే జోన్ కధ ఈనాటిది కాదు, అయిదు దశాబ్దాల చరిత్ర ఉంది. నాడు కాంగ్రెస్ ఎంపీ హోదాలో తెన్నేటి విశ్వనాధం తొలిసారిగా విశాఖకు రైల్వే జోన్ కావాలని నినదించారు. అంతే కాదు, దాని కోసం ఆయన పోరాటం కూడా చేశారు. ఆ తరువాత అది అలా చేతులు మారి నాయకులు పార్టీలు దాటి జనంలో అతి పెద్ద సెంటిమెంట్ గా మారింది. 2014 ఎన్నికల్లఒ బీజేపీకి బలమైన ఎన్నికల హామీగా మారడమే కాదు ఆ పార్టీని గెలిపించింది కూడా. దాంతోనే చివరి ఏడాది అయినా బీజేపీ ఈ హామీని నెరవేర్చుకోవాల్సివచ్చింది.రైల్వే యూనియన్లు విజయవాడ కేంద్రంగా బలంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నాటి అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు కొందరు విజయవాడకే రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు. ఎటూ అమరావతి రాజధానిగా ఉన్నందువల్ల విజయవాడలో జోన్ పెడితే హైదరాబాద్ మాదిరిగానే రెండూ కలసే ఉంటాయని, అభివృద్ధి సాధ్యపడుతుందని కూడా లెక్కలు చెప్పారు. అయితే అప్పటికే విశాఖలో రైల్వే జోన్ ఉద్యమం మొదలైనందువల్ల అది వీలుపడలేదు. బీజేపీ కూడా రాజకీయ కారణాల వల్ల విశాఖ వైపే మొగ్గు చూపింది. ఇపుడు రైల్వే యూనియన్ ఎన్నికల వేళ విజయవాడలో రైల్వే జోన్ అంటూ నినాదాలు బయటకు వస్తున్నాయి.విశాఖను పాలనా రాజధానిగా జగన్ చేస్తామని చెబుతున్నారు. ఇవాళ కాకపోయినా రేపు అయినా అది జరుగుతుంది కాబట్టి విజయవాడకు జోన్ తీసుకురావాలన్నదే ఒక ఎత్తుగడగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ డిమాండ్ వెనక కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సామాజిక శక్తులు కూడా ఉన్నాయని కూడా అనుమానిస్తున్నారు. విజయవాడ పెద్ద రైల్వే జంక్షన్ కావడంతో అక్కడ జోన్ ఉంటే ప్రగతి వేగంగా జరుగుతుంది అని భావిస్తున్నారు. అమరావతి నుంచి కొంత భాగం రాజధానిని విశాఖకు తీసుకుపోతున్నందున ఒక రకంగా ఇది నష్ట పరిహారం ప్యాకేజిగా కూడా భావిస్తున్నారుట. ఇక విశాఖలో పేరుకు జోన్ అని ప్రకటించినా కార్యకలాపాలు ఏవీ ప్రారంభం కాకపోవడం కూడా ఈ డిమాండ్ చేయడానికి వీలు కల్పిస్తోందని అంటున్నారు. మొత్తం మీద మెల్లగా మొదలైన ఈ డిమాండ్ కి సానుకూల స్పందన వస్తే తెర వెనక ఉన్న రాజకీయ శక్తులు కూడా బయటకు వస్తాయని అంటున్నారు. మరి విశాఖ నుంచి జోన్ బు తరలించాలన్న దానిపైన బీజేపీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే తప్ప విశాఖకు జరిగే న్యాయాన్యాయాల సంగతి పూర్తిగా అర్ధం కాదు.

Related Posts