YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎప్పటికైనా ఆసిఫాబాద్ మారేనా

ఎప్పటికైనా ఆసిఫాబాద్ మారేనా

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా ఆసిఫాబాద్‌ నియోజకవర్గం దశ మారడం లేదు. పోరాటాల గడ్డగా పేరుపొందినా ఈ ప్రాంతం సమస్యల అడ్డాగా మారింది. ఇప్పటికీ విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, సాగునీటి వసతిలో ఎంతో వెనుకబడి ఉంది. ఎన్నికలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజల సమస్యలు తీరుస్తామని పాలకులు హామీలు గుప్పించినా నెరవేరని పనులెన్నో కళ్లముందే కదలాడుతున్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450కోట్లతో నిర్మిస్తున్న కుమురంభీం ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి పూర్తి కావడం లేదు. కెరమెరి మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 32వేల జనాభా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వివాదాస్పద గ్రామ పంచాయతీలు పరందోలి, అంతాపూర్, బోలాపటార్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆ పంచాయతీల్లో 12 గ్రామాలు ఉండగా ఎక్కడ కూడా నీటి సౌకర్యం లేదు. గతంలో నిర్మించిన మంచినీటి పథకాలు, చేతిపంపులు అలంకార ప్రాయంగా మారాయి. ఒక్కసారి చెడిపోతే మరమ్మతు చేసే నాయకుడు ఉండదు. 4 వేల జనాభా ఉన్న ఆ గ్రామాల్లో 80 శాతం రైతులకు సాగు భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పరందోలి గ్రామ పంచాయతీలోని 6 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక అభివృద్ధి నిలిచిపోయింది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్ద కాలంగా పనులు పూర్తి కావడం లేదు. 2007లో పూర్తి కావలసిన పనులు నిధుల కొరత, అటవీశాఖ క్లియరెన్స్, పునరావాసం తదితర కారణాలతో పనులు పూర్తి కాకపోవడంతో రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. అలాగే 1998లో రూ.100 కోట్లతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు పరిస్థితి అలాగే ఉంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్‌ మండలాల్లో 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్నా కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు.ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.85 కోట్లతో ప్రతిపాదనలు పంపినా పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని గుండి వంతెన పిల్లర్ల దశలోనే ఉంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.60 కోట్లు కేటాయించినా గత పదేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వంతెన లేక వర్షాకాలంలో ఈ గ్రామాలకు 108, 104 కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.   నియోజకవర్గ కేంద్రం ఆసిఫాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఇంటర్‌తో చదువు మానేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ కళాశాల మాత్రం మంజూరు కావడం లేదు. జిల్లా కేంద్రంలో రూ.11.22 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన ప్రభుత్వాస్పత్రిలో అవసరమున్న వైద్యులు లేక రోగులకు సేవలందడం లేదు. 50 పడకల ఆస్పత్రిలో కేవలం జ్వరాలకు తప్ప ఇతర జబ్బులకు వైద్యం అందడం లేదు. గతేడాది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కార్పొరేటుకు ధీటుగా వైద్యసేవలందించి, వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించినా ఫలితం లేకుండాపోయింది.   ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్య రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్‌రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జి లేకపోవటం. ఈ బ్రిడ్జి కోసం ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి నాయకులు హామీలు ఇవ్వడమే తప్పా ప్రయాణికుల కష్టాలకు పరిష్కారం చూపడం లేదు. కైరిగూడ గ్రామానికి వెళ్లే దారిలో గుండాల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నో ఏళ్లుగా నాయకులు హామీలు ఇచ్చినా వంతెన నిర్మించలేదు. కొన్ని నెలల క్రితం బ్రిడ్జికి రూ.5కోట్లు మంజూరుకాగా ప్రభుత్వ రద్దుకు కొన్ని రోజుల ముందే పనుల ప్రారంభానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు.తక్కళ్లపల్లి నుంచి రోళ్లపాడు వరకు బీటీ రోడ్డు లేకపోవటంతో వర్షాకాలం ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే కొన్ని నెలల క్రితం సుమారు రూ.4కోట్లతో తక్కళ్లపల్లి రైల్వే గేట్‌ నుంచి రోళ్లపాడు వరకు బీటీ రోడ్‌ మంజూరు కాగా పనుల ప్రారంభానికి భూమిపూజ చేశారు. గత నెలలో రోడ్డు వెంట అక్కడడక్కడ బర్మ్‌ పనులు చేపట్టి వదిలేశారు. తప్ప పనుల్లో పురోగతి లేదు. కొండపల్లి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. రాంపూర్‌ గ్రామానికి సైతం బీటీరోడ్‌ లేకపోవటంతో వర్షాకాలం కనీసం నడిచి వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. ఐదేళ్ల క్రితం ఉమ్రి వాగు నుంచి నిర్మిస్తున్న రోడ్డు ఆర్‌ఎఫ్‌లో ఉందని అటవీ అధికారులు నిలిపి వేశారు. ఇప్పటి వరకు దానికి బీటీ వేయలేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సమస్య తీరిపోతుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పలుమార్లు అనుమతులు ఇప్పించి రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.  తిర్యాణి మండలం.. తిర్యాణి మండలంలో ప్రధాన సమస్య బస్టాండ్‌ లేకపోవడం. మండలంలోని 29 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజలు మండలం నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్‌ఐబీ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రధాన దారి తిర్యాణి నుంచి వెళ్లాలి. నిత్యం వందలాది మంది బస్‌లు, ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా తిర్యాణి నుంచి తాండూర్‌ ఐబీ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో బస్డాండ్‌ లేక బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు చెట్లనీడన సేద తీరుతున్నారు.

Related Posts