YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ భూముల్లో రియల్ వ్యాపారాలు

ప్రభుత్వ భూముల్లో రియల్ వ్యాపారాలు

పాచిపెంట మండలంలోని కుడుమూరు భూబాగోతం అనే నాటకాన్ని రెవెన్యూ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికారపార్టీ పెద్దలు గత కొంతకాలంగా నడిపిస్తున్నారు. తరతరాలుగా గిరిజనుల సాగులో ఉన్న భూములపై ఎలా వాలిపోవాలన్నదానిపై వారు వ్యూహాలు పన్నుతున్నారు. తాత ముత్తాతల నుంచి సాగుచేస్తున్న భూముల నుంచి గిరిజనులను ఎలా వెళ్లగొట్టాలనే కుట్రలు, కుతంత్రాలు సాగిస్తున్నారు. తాతలనాడు నేతులు తిన్నాం, ఇప్పుడు మా మూతులు వాసన చూడండని చందాన కుడుమూరు మొకాసాదారు కుటుంబీకులు ఆ భూములు తమవేనని వాదిస్తున్నారు. 1956లోనే జమిందారీ, సంస్థానాలు, మొకాసాలు రద్దు కావడంతో వారి ఆస్తులు ప్రభుత్వ పరమయ్యాయి. అయినా కుడుమూరు మొకాసాదారులమని చెప్పుకుంటున్న పలువురు గిరిజనుల సాగులో ఉన్న భూములు తమవేనని వాదించడం, దీనికి రెవెన్యూ అధికారులు మద్దతు పలకడం వివాదాస్పదమవుతోంది. 1988లో అప్పటి ప్రభుత్వం కొంతమంది గిరిజనులకు ఈ భూముల్లో పట్టాలు కూడా పంపిణీ చేసింది. సర్వే నెంబర్‌ 48లో గల 780ఎకరాల భూములను సుమారు 12గ్రామాలకు చెందిన వందలాది గిరిజన కుటుంబాలు సాగుచేస్తున్నాయి. కొండలు, గుట్టలు గుట్టలుగా వున్న భూములను చదును చేసుకుని మెట్టపంటలైన మొక్కజొన్న, ఉలవలు, పత్తి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల తరబడి సాగులో ఉన్న భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వకపోవడంతో గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మొకాసాదారులమని చెప్పుకొని పలువురు గిరిజన రైతుల నుంచి ఏటా భుమి శిస్తులు కూడా వసూలు చేసేవారు.కుడుమూరు భూబాగోతం గత కొంతకాలంగా రెవెన్యూ అధికారుల అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికారపార్టీ పెద్దలు నడిపిస్తున్నారు. మొకాసాదారులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెట్టుబడి ఇస్తూ గిరిజనులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం క్రితం మొకాసాదారు కుటుంబీకులు ప్రయివేటు సర్వేయర్లను తీసుకొచ్చి భూముల్లో సర్వే రాళ్లు వేయించేందుకు ప్రయత్నించారు. సాగుభూములకు పట్టాలివ్వాలని అనేకసార్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నాలు చేశారు. గిరిజనులు ఎన్ని ఆందోళనలు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వందలాది గిరిజన కుటుంబాల సమస్యపై దృష్టి పెట్టాలని జిల్లా ఉన్నతాధికారులు కూడా భావించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక అధికారపార్టీ నాయకుల ప్రమేయం ఉండడమేనని ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారపార్టీ నాయకుడి కనుసన్నల్లో కుడుమూరు భూబాగోతం నడుస్తోందని, ఆయన సూచనల మేరకు స్థానిక మండల వైసిపి నాయకులు మొకాసాదారునికి మద్దతుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కుడుమూరు భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర కిమ్మనకుండా ఉండడం చర్చనీయాంశమవుతోంది. గత రెండేళ్లుగా ఈ భూవివాదం రావణకాష్టంలా రగులుతున్నా ఆయన మౌనం వీడడం లేదు. అధికార పార్టీ జిల్లా అగ్రనేత అండతో భూబాగోతం నడుస్తున్న నేపథ్యంలోనే ఆయన నోరు మెదపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా టిడిపి నాయకులు దీనిపై కిమ్మనలేదు. ఇప్పుడు వైసిపి నాయకులు బహిరంగంగా మొకాసాదారులకు మద్దతు పలకడం చర్చనీయాంశమవుతోంది. తమ ఓట్లతో విజయం సాధించిన అధికార పార్టీ నాయకులు తమ ప్రయోజనాలను దెబ్బ తీసేలా ప్రవర్తించడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు దండిగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయగల సామర్థ్యం ఉన్న అధికారులు జిల్లాలో వున్నారు. ప్రధానంగా మండలంలోని ఓ రెవెన్యూ అధికారి వ్యవహారశైలిపై గిరిజనులు తీవ్రంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల గిరిజనులతో మాట్లాడ్డానికి కుడుమూరు వచ్చిన సందర్భంలో సబ్‌ కలెక్టర్‌ విధె ఖరే దృష్టికి గిరిజనులు ఆ అధికారి తీరుపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజన్నదొర, కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ స్పందించి వందలాది గిరిజనుల సమస్యపై స్పందించాలని కోరుతున్నారు.

Related Posts