YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలంలో విష్ణు మాయ...?

కమలంలో విష్ణు మాయ...?

బీజేపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. భారీ ఎత్తున పుంజుకుంటామ‌ని.. వ‌చ్చే 2024లో పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని.. ఇదే త‌మ ప్రధాన సంక‌ల్పమ‌ని బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ ఈ మాత్రమైనా అభివృద్ధి చెందిందంటే బీజేపీ చ‌ల‌వేన‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు కనుకే.. ఏపీలో ప్రజ‌లు సుఖంగా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఇంత చెబుతున్నా.. ఈ విష‌యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే నేత‌లు ఎక్కడ ‌? అనే ప్రశ్నకు మాత్రం స‌మాధానం లేకుండా పోయింది.ఇక‌, అధికారంలోకి రావాల‌ని ఏ పార్టీకైనా.. ఉంటుంది. నేత‌ల‌కైనా.. పార్టీల‌కైనా అధికార‌మే ప‌రమావ‌ధి క‌నుక‌.. ఈ విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఏ పార్టీ అయినా అధికారం లోకి రావాలంటే.. క్షేత్రస్థాయిలో పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలి. అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున మాట్లాడే వారికి విష‌యం తెలిసి ఉండాలి. పార్టీ లైన్ తెలిస్తే.. దానిని ప‌ట్టుకుని రాజ‌కీయం చేసేందుకు కూడా అవ‌కాశం ఉంది. కానీ, బీజేపీలో ఈ లైనే క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని రోజులు టీడీపీపై ఫైర‌వుతారు. మ‌రికొన్ని రోజులు వైసీపీపై ఫైర‌వుతారు.ఏపీ బీజేపీలో ఉన్న ప‌ది మంది నాయ‌కుల‌ది త‌లోదారి. పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్న వారు.. 2014 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన వారు.. 2019 ఎన్నిక‌లకు ముందు, ఆ త‌ర్వాత వ‌చ్చిన వారు ఇలా గ్రూపులు ఉన్నాయి. వీరిలో కొంద‌రు చంద్రబాబు, టీడీపీకి స‌పోర్టర్స్‌.. మ‌రి కొంద‌రు జ‌గ‌న్ అంటే చెవి కోసుకుంటారు. వీరు ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వారు అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తూ ఉంటారు. దీంతో అస‌లు బీజేపీ వ్యూహం ఏంటో తెలియ‌కుండా పోయింది. ఇక‌, పార్టీ ప‌రంగా చూస్తే.. జిల్లాకో ప్రధాన కార్యద‌ర్శి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా బాగానే ఉంది. ఎటొచ్చీ.. ప్రజ‌ల్లోకి వెళ్లేవారే లేకుండా పోయారు. దీంతో.. ఇప్పుడు స‌ద‌రు నాయ‌కులు పార్టీ చీఫ్ సోము వీర్రాజును క‌లిసి.. సార్ మ‌న పార్టీ స్టాండ్ ఏంటి ? ఎలా ముందుకు వెళ్లాలి ? అనే విష‌యాల‌ను చ‌ర్చించాల్సిన అవ‌స‌రం చాలానే ఉంది.అయితే ఇప్పుడు పార్టీలో చాలా మందికి సోమును క‌లిసే ఛాన్సే లేకుండా పోతోంద‌ట‌. పార్టీలో మ‌రో నేత‌, నెంబ‌ర్ 2గా ఉన్న విష్ణువ‌ర్థన్ రెడ్డి అనుమ‌తి ఉంటేనే సోము అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారన్న ప్రచారం బాగా వ‌చ్చేసింది. దీంతో స‌ద‌రు నేత‌లు.. రాజుగారిని క‌ల‌వాలంటే.. రెడ్డిగారి అనుమ‌తి ఉండాలా ? అని పెద‌వి విరుస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో నేత‌లు ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోతున్నారు. మాకెందుకు ఈ గొడ‌వ‌.. వారే మాట్లాడుతున్నారు.. ఇక‌పైనా వారే మాట్లాడుకుంటారులే.. అని స‌రిపెట్టుకుంటున్నారు. దీంతో బీజేపీ ప్రజ‌ల‌కు చేరువ అయ్యేది ఎప్పుడు? అనే ప్రశ్నలు త‌లెత్తుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts