YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ లో 60కి పైగా చిరుతలు

నిజామాబాద్ లో 60కి పైగా చిరుతలు

నిజామాబాద్, జనవరి 22, 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రెండేండ్లలో చిరుతల సంతతి గణనీయంగా వృద్ధి చెందింది. అటవీ ప్రాంతం విస్తరించడం, ఆవాసానికి అనుకూలమైన ప్రదేశాలు ఉండడమే ఇందుకు కారణం. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 52,133 హెక్టార్లు, ఆర్మూర్‌లో 33,778 హెక్టార్లు, కామారెడ్డిలో 40,500 హెక్టార్లు, బాన్సువాడ డివిజన్‌లో 40,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 2018లో నిర్వహించిన జంతుగణనలో 50 చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 60కిపైగానే ఉంది. మూడేండ్లలో 9 చిరుతలు మృతిచెందాయి. ఆకురాలు కాలం ప్రారంభం కావడంతో దట్టమైన అటవీప్రాంతం పలుచబడుతున్నది. దీంతో ఆహార వేటలో భాగంగా చిరుతలు కొద్దిరోజులుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో చిరుతలు పశువులపై దాడిచేసిన సంఘటనలు వెలుగుచూశాయి. చిరుత పులులు చాలా చురుకైన క్రూరజంతువు. పులులకు సరిసమానమైన శక్తియుక్తులు కలిగిన ఈ జంతువుకు ప్రత్యేకమైన నైపుణ్యాలున్నాయి. ఆహారం కోసం అడవిలో కొనసాగించే వేట ఓ రకమైన రణరంగాన్నే సృష్టించే శక్తి దీని సొంతం. చెట్లు ఎక్కడం దగ్గరి నుంచి బండరాళ్లను సులువుగా చేరుకోగల సత్తా వీటికి ఉంది. గంటకు 58 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసే చిరుత పులులు ఉమ్మ డి నిజామాబాద్‌ జిల్లాలో సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న హరితహారం, అటవీ రక్షణ ఏర్పాట్లతో జంతుజాలానికి మేలు జరుగుతోంది. 2018లో అటవీ శాఖ నిర్వహించిన జంతు గణనతో పోలిస్తే ప్రస్తుతం మరింతగా చిరుతలు వృద్ధి చెందినట్లుగా అటవీ శాఖ భావిస్తోంది. గడిచిన కొద్ది కాలంలో తరచూ వీటి సంచారం గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల వెలుగు చూస్తుండడంతో అటవీ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. అడవిలో ఆహారం కోసం జంతువులను వేటాడుతున్న క్రమంలోనే అవి దారితప్పి జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నట్లుగా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది. దీనికి తోడుగా ప్రస్తుతం ఆకు రాల్చే కాలం దగ్గర పడుతుండడం, కొన్ని రకాల వృక్షాల ఆకు రాలడంతో దట్టమైన ప్రాంతమంతా పలుచగా కనిపిస్తుండడంతో చిరుతల సంచారం సులువుగా తెలిసిపోతోంది. తద్వారా సామాన్య ప్రజలు వీటి కదలికలను ఇట్టే పసిగట్టేస్తున్నారు.  చిరుతల సంచారం ఉభయ జిల్లాల్లో చాలా చోట్ల వెలుగు చూసింది. నెల రోజుల క్రితం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఒక మేకను సంహరించి ఆరగించింది. లింగంపేట మండలంలోనూ చిరుత హల్‌ చల్‌ చేసింది. గాంధారి మండలంలోనూ చిరుత కదలికలు కనిపించాయి. నాలుగైదు రోజుల క్రితం మాక్లూర్‌ మండలం మాదాపూర్‌లోని గుట్టపై రారాజులా కూర్చున్న చిరుతను స్థానికులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏడాది క్రితం కూడా చిరుత ప్రజల కంటికి చిక్కింది. ఆది, సోమవారాల్లో తాడ్వాయి, లింగంపేట మండలాల మధ్య చిరుతపులి సంచారంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఎడపల్లి మండలంలోనూ చిరుతను చూసినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇలా అటవీ ప్రాంతం దట్టంగా ఉన్న ప్రాంతాల్లో చిరుత పులులు అడపా దడపా సంచరిస్తూ జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలు అటవీ అధికారులకు చిక్కినట్లే చిక్కి గంటల వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకు మకాం మార్చేస్తున్నాయి. చిరుతలు అడవిలో సందడి చేస్తున్నాయి. తలదాచుకునేందుకు దట్టమైన పొదలను అడ్డాగా చేసుకుని తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. రక్షణ కోసం బండరాళ్లు, గుహలను పోలిన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. వేటాడుతున్న క్రమంలో జంతువులను తరుముతూ మైదాన ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. మక్క, చెరుకు చేనుల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఆహారం కోసం ఆగమాగమై జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంలో కొన్ని ప్రమాదాలకు గురవుతుండగా... మరికొన్ని వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. మూడేండ్లలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 9 చిరుత పులులు వివిధ కారణాలతో ప్రాణాలు విడిచినట్లుగా అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతంలో అడవి పందులు, కుందేళ్లు, జింకల సంఖ్య సమృద్ధిగా పెరిగింది. ఎక్కడైతే జంతుజాలం సమృద్ధిగా ఉంటుందో అక్కడే చిరుతల మనుగడ ఎక్కువగా ఉంటుందనేది అటవీ శాఖ అంచనా. ఉభయ జిల్లాల పరిధిలో శాకాహార జంతువుల సంఖ్య అమాంతం రెట్టింపు కావడంతో వాటినే లక్ష్యంగా చేసుకుని చిరుత పులులు వేటాడి ఆరగిస్తున్నట్లుగా ఫారెస్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఆకురాల్చు కాలం ఆరంభమవుతున్న వేళ అడవి పలుచ బడుతుండడంతోనూ చిరుతల సంచారం తేలికగా బాహ్య ప్రపంచానికి తెలిసిపోతున్నదని అటవీ శాఖ చెబుతోంది.ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబార్‌, కొండ గొర్రెలు, దుప్పులు, నీల్గాయి, తోడేళ్లు, మనుబోతులు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు, అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నాయి. 2018లో నిర్వహించిన జంతు గణనలో వీటి సంఖ్య భారీగా ఉన్నట్లుగా తేలింది. సరిగ్గా రెండున్నరేండ్ల క్రితం రెండు జిల్లాల్లో చిరుత పులుల సంఖ్యను 50గా నిర్ధారించారు. గడిచిన కొద్ది కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 60కిపైగానే చిరుత పులులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని అటవీ శాఖ స్పష్టం చేస్తోంది. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 52,133 హెక్టార్ల విస్తీర్ణం, ఆర్మూర్‌లో 33,778 హెక్టార్లు, కామారెడ్డి 40,500హెక్టార్లు, బాన్సువాడ డివిజన్‌లో 40,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. విశాలమైన అడవుల్లో నీటి సంపద పుష్కలంగా ఉండడం, హరిత సంపద వృద్ధి చెందుతుండడం మూలంగా అటవీ జంతువులకు రక్షణ పెరిగింది. వేటగాళ్ల ఆగడాలకు కళ్లెం పడడంతో జంతుజాలానికి భద్రత దొరికింది. అడవుల్లో మానవ సంచారం తగ్గడంతో జీవవైవిధ్యం వెల్లివిరుస్తోంది.

Related Posts