YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిల పార్టీ ‘ప్రకటన’తో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు 

షర్మిల పార్టీ ‘ప్రకటన’తో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు 

షర్మిల పార్టీ ‘ప్రకటన’తో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు 
         హైదరాబాద్ ఫిబ్రవరి 10
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు స్థానిక ఎన్నికల వేడి కొనసాగుతుండగా... మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ షర్మిల రాజకీయ పార్టీ ‘ప్రకటన’ పెను సంచలనం సృష్టించింది. తెలంగాణలో రాజశేఖరరెడ్డి అభిమానులు అత్యధికంగా రెడ్డి కులస్తులు, క్రిస్టియన్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్నారని.. వారందరికీ ఒక  వేదికగా షర్మిల పార్టీ నిలుస్తుందని చెబుతున్నారు. షర్మిల పార్టీ వల్ల పరోక్షంగా టీఆర్‌ఎ్‌సకు లబ్ధి  చేకూరుతుందని.. ఇది కూడా రాజకీయ ప్రణాళికలో భాగమేనని భావిస్తున్న రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. షర్మిల రాజకీయ పార్టీ ‘ప్రకటన’ వెంటనే అమరావతిలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి... విషయాన్ని ‘తేలిక’ పరిచే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన మాటల్లోనూ అసలు విషయం దాగలేదు. ఇద్దరి మధ్య విభేదాలు నిజమని, దీని వల్లే అన్న జగన్‌ వద్దన్నా, తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల ముందుకే వెళ్లారని పరోక్షంగా అంగీకరించినట్లయింది. మీడియా సమావేశంలో సజ్జల సుదీర్ఘ వివరణను ఇచ్చినా... పలుచోట్ల ఆయన తడబడటం స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో ఒకింత కలవరం, కొంత గుబులు మొదలైంది. సజ్జల రామకృష్ణా రెడ్డి మేకపోతు గంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శించారని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. ఇంకొందరు రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని చెబుతూ వస్తున్నారు. జగన్‌ రాజకీయ లాలూచీలను  ప్రోత్సహిస్తున్నారని.. షర్మిల పార్టీ అంశమే ప్రత్యక్ష ఉదాహరణ అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ నేతలు మాత్రం మొదటి నుంచీ ‘మౌన వ్యూహం’ అనుసరించారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దంటూ పార్టీ హైకమాండ్‌ నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయి.రాజకీయంగా లోపాయికారి ఒప్పందాలు ఎన్ని ఉన్నా... షర్మిల రాజకీయ పార్టీతో వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత ‘ఇమేజ్‌’కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిసున్నాయి. ఆయన తన సొంత చెల్లెలికే న్యాయం చేయలేదనే సంకేతాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని ప్రతి వేదికపైనా చాటి చెప్పారు. పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లోనూ కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత... షర్మిల మళ్లీ ఎక్కడా కనిపించలేదు. చెల్లెలికి జగన్‌ న్యాయం చేయలేదని, ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైసీపీ ముఖ్యనేతలు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు షర్మిల ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక... సొంత అస్తిత్వాన్ని, బలాన్ని చాటుకోవాలనే లక్ష్యముందని చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీలో అప్పుడెప్పుడో జరిగిన అధికార మార్పిడిని అస్త్రంగా చేసుకుని చంద్రబాబును వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు జగన్‌ చేసిన అన్యాయాన్ని అస్త్రంగా చేసుకుని ఇతర పార్టీల వారు విమర్శించడం మొదలవుతుందని ఆందోళన చెందుతున్నారు. షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం సహా ఇతర ఏ పదవిని ఇచ్చినా వద్దనే వారు లేరని...  వేంరెడ్డి ప్రభాకర రెడ్డి, అంబానీలకు సన్నిహితుడైన పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక జగన్‌ స్వీయ ప్రయోజనాలు ఉన్నాయని పార్టీ ముఖ్యనేతలు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. షర్మిలను రాజ్యసభకు పంపి ఉంటే.. కుటుంబ నేపథ్యంతో నిమిత్తం లేకుండా తనను నమ్ముకున్న వారికి జగన్‌ చేయూతను ఇస్తారన్న అభిప్రాయమే కలిగేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. సొంత చెల్లెలిని కూడా జగన్‌ మోసం చేశారనే విమర్శలకు ఇప్పుడు తావు ఇచ్చినట్లయిందని పేర్కొంటున్నారు. మీడియా ద్వారా సజ్జల ఇచ్చిన వివరణ మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడుతున్నందుకు జగన్‌ బాధపడుతున్నారంటూనే.. అన్నగా ఆమెకు ఆశీస్సులు ఉంటాయంటూ సజ్జల చెప్పడం మరింత చిత్రంగా ఉందని పేర్కొంటున్నారు.

Related Posts