YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజకీయాలకు దూరమౌతున్న సీనియర్లు

రాజకీయాలకు దూరమౌతున్న సీనియర్లు

విజయవాడ, ఫిబ్రవరి 26, 
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో చ‌క్రం తిప్పిన రెడ్డి మేధావులు ఇప్పుడు ఏమ‌య్యారు ? ఎక్కడున్నారు ? గ‌తంలో వైఎస్ అంటే.. ప్రాణం పెట్టి ఆయ‌న వెంట ఉన్నా వారిలో సీనియ‌ర్ రెడ్డి నేత‌లు జ‌గ‌న్‌కు ఎందుకు ? దూర‌మ‌య్యారు ? అన్నదానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చలు వినిపిస్తున్నాయి. గ‌తంలో వైఎస్‌తో విబేధించిన సీనియ‌ర్ రెడ్డి నేత‌లు కూడా త‌ర్వాత త‌మ అవ‌స‌రాల కోస‌మో లేదా వైఎస్ బుజ్జగిస్తేనో తిరిగి వైఎస్ చెంత‌కే చేరిపోయేవారు. అంతేకాని పూర్తిగా వైఎస్‌కు ఎప్పుడూ దూరం కాలేదు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలో ఆ ప‌రిస్థితి లేదు. డీఎల్ ర‌వీంద్రారెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కాసు వెంక‌ట‌ కృష్ణారెడ్డి.. ఇలా అనేక మంది సీనియ‌ర్ రెడ్డి నేత‌లు నేడు క‌నిపించ‌డం లేదు. త‌ర్వాత కాలంలో వైఎస్ విభేదించిన ఎంవీ మైసూరారెడ్డి .. జ‌గ‌న్‌తో జ‌ట్టుక‌ట్టారు. ఆయ‌న పార్టీ వైసీపీలో చేరారు. కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. అయితే.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.ఇక‌, ఇప్పుడు వీరంతా ఎక్కడున్నార‌నే విష‌యం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. వీరంతా సీమ స‌హా కోస్తా జిల్లాల్లోనూ ప్రభావం చూపించిన నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. రెడ్డి రాజ్యం ఉంటే బాగుంటుంద‌ని కోరుకున్న ప‌క్కా కాంగ్రెస్ వాదులు కూడా. మ‌రీ ముఖ్యంగా వైఎస్ నాయ‌క‌త్వానికి జై కొట్టారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఎవ‌రికి వారుగా విడిపోయారు. మాజీ మంత్రి కాసు వెంక‌ట కృష్ణారెడ్డి జ‌గ‌న్‌కు దూరంగానే ఉన్నారు. ఆయ‌న ఇప్పట‌కీ కాంగ్రెస్ వాదిగానే కొన‌సాగుతున్నారు. ఆయ‌న త‌న‌యుడు కాసు మ‌హేష్‌రెడ్డి మాత్రం వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన వారిలో జేసీ దివాక‌ర్ , కోట్ల కుటుంబం టీడీపీలో చ‌క్రం తిప్పుతున్నారు. ఈ రెండు కుటుంబాలు కూడా వైసీపీలోకి వెళ్లాల‌నుకున్నాయి.. ఆ పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే వీరు మాత్రం అటు వైపు తొంగి చూసే సాహ‌సం చేయ‌లేదు.క‌డ‌ప జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణ‌రెడ్డి జ‌గ‌న్‌తో ఉండి ఉండీ.. ఆ త‌ర్వాత టీడీపీ ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి కూడా ఇప్పుడు మౌనంగాఉన్నారు. వాస్తవానికి క‌డ‌ప‌లో మంచి ప‌ట్టున్న వీరు రాజ‌కీయంగా ఇప్పుడు డ‌మ్మీల‌య్యార‌నే వాద‌న ఉంది. డీఎల్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు భేష‌రుతుగానే వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టించారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న‌కు ఏదో ప‌ద‌వి ఇచ్చి జ‌గ‌న్ ప్రయార్టీ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నా ఆ ఊసే లేదు. ఆఖ‌రుకు జేసీ కుటుంబం కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ వైపు చూసింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే వారు చంద్రబాబు మాట‌కు క‌ట్టుబ‌డి టీడీపీలోనే ఉండిపోయారు. జేసీ వార‌సులే త‌మ‌కు స్వయంగా వైసీపీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని చెప్పారు.ఇక మ‌రో రాజ‌కీయ కురు వృద్ధుడు, రెడ్డి నేత అయిన మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి త‌న‌యుడితో స‌హా వైసీపీలో చేరినా ఆయ‌న‌కు గుర్తింపు లేదు. ఏదేమైనా నాడు వైఎస్ ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో హ‌వా చెలాయించిన రెడ్డి నేత‌లు కొందరు వేరే పార్టీల్లో ఉన్నా.. కొంద‌రు వైసీపీలో ఉన్నా… మ‌రి కొంద‌రు త‌ట‌స్థంగా ఉన్నా వీరు మాత్రం జ‌గ‌న్ ద‌గ్గర‌కు వెళ్లే సాహ‌సం మాత్రం చేయ‌డం లేదు. వీరు ఇప్పట‌కీ రాజ‌కీయంగా రాణించాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నా జ‌గ‌న్ మాత్రం వీరిని అవుట్ డేటెడ్ లీడ‌ర్లుగా చూస్తున్నారా ? అన్న‌ది ఓ సందేహ‌మే. మ‌రి కొంద‌రు నేత‌లు మాత్రం జ‌గ‌న్ మ‌న‌స్తత్వ మెరిగి త‌మ‌కు తామే దూరంగా ఉంటున్నార‌ట‌.గాదె, డీఎల్ లాంటి నేత‌లు వైసీపీలో ఉన్నా ఏదో త‌మ వార‌సుల భ‌విష్యత్తు కోస‌మే పొలిటిక‌ల్ గేమ్‌లో తాము పావులు అయ్యామే త‌ప్పా అంత‌కు మించి ఏం ఆశించం అనుకుంటోన్నార‌ట‌…. అది నాటి రెడ్డి నేత‌ల ప‌రిస్థితి. ఏదేమైనా ఈ రెడ్డి నేత‌లు తాము ఎప్పటి నుంచో కోరుకున్నట్టుగానే రెడ్డి ప్రభుత్వమే ఏర్పాటైనా వీరు ఏం చేయ‌లేని ప‌రిస్థితి..!

Related Posts