YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సమూల ప్రక్షాళనకు జగన్ అడుగులు

సమూల ప్రక్షాళనకు జగన్ అడుగులు

విజయవాడ, మార్చి 27, 
ఏపీలో జగన్ ని చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోయేవారు. ఏంటి అక్కడ ముఖ్యమంత్రి ఇంటి పెరట్లో కల్ప వృక్షం ఏమైనా ఉందా, లేక చేతిలో అక్షయ పాత్ర ఉందా అని చర్చించుకునేవారు. చూడబోతే 90 వేల కోట్ల అప్పులతో ఏపీ ఏర్పడింది. విశాఖ తప్ప ఒక్క మెగా సిటీ లేదు. భారీ పరిశ్రమలు కూడా పెద్దగా లేవు. ఇక అన్ని రకాలుగా నష్టాల కష్టాలతో ఉన్న ఏపీకి తొలిసారి సీఎం అయిన జగన్ ఇలా పధకాల పేరిట పెద్ద ఎత్తున పందేరం చేయడమేంటి అని కూడా విస్తుబోయారు. కేంద్రం చూస్తే ఏ మాత్రం సాయం చేయని స్థితి అని అందరికీ తెలుసు. ఇక కరోనా వచ్చి ప్రపంచాన్నే కాటేసింది. ఎక్కడా ఆర్ధిక వ్యవస్థ లేవలేదు.కెనడా లాంటి సంపన్న దేశాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలు కరోనా వేళ తమ ప్రజల ఖాతాలో నగదు వేసి ఆదుకున్నాయని చదివి భారతీయులు మాకు ఇలాంటి సౌభాగ్యం లేదే అని వాపోయారు. కానీ ఏపీలో చూస్తే కరోనా వేళ రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఇంటికీ వేయి రూపాయలు వంతున చెల్లించి కోటిన్నర కుటుంబాలను ఆదుకున్నారు. అంతే కాదు ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి జనాలకు మేలు చేకూర్చారు. ఆర్ధిక మంత్రి తాజాగా చెప్పిన లెక్క ప్రకారం అయితే ఏకంగా తొంబై వేల కోట్ల రూపాయలు ఇరవై నెలల వ్యవధిలో ఖజానా నుంచి జగన్ తీసి ఖర్చు పెట్టారు అంటే గ్రేట్ అని ఎవరైనా అనకుండా ఉండగలరా.అయితే ఈ పధకాలలో పనికివచ్చేవి ఉన్నాయి. అమలు చేయకపోయినా ఫరవాలేదు అనిపించేవీ ఉన్నాయి. ఇక అర్హులు కాని వారు కూడా దూరిపోయి అనుభవిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. మరి ప్రభుత్వం చూస్తే నిధులు కుప్ప పోసినవి తెచ్చి ఖర్చు పెట్టడం లేదు. అలాగే బంగారు గనులు తవ్వి తీసి మరీ పధకాలకు వెచ్చించడంలేదు. అచ్చంగా అప్పు చేసి పప్పు కూడు తినీపిస్తోంది. ఇదే మాటను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేశారు. మరి ఇలా ఖర్చు చేస్తూ పోతే ఏపీ చితికిపోవడం ఖాయమే. అందుకే దీని మీద ఇపుడు జగన్ సర్కార్ సీరియస్ గా ఉందని అంటున్నారు. పధకాలు ఉండాలి. కానీ అవి అర్హులకు చేరాలి అన్నదే వైసీపీ అజెండా కాబోతోందిట.ఇప్పటికే తెల్ల రేషన్ కార్డును చాలా మందికి తీసేసి అర్హుల లెక్క తేల్చారు. అయినా ఎలా కూడినా కూడా కధ అక్కడికే వస్తోంది. అంటే ఎక్కడో మతలబు ఉంది అన్న మాటేగా. దానితో పాటు ఇపుడు ఒక ఇంటికి ఒక పధకం అన్నట్లుగా వర్తింపచేస్తారు అన్న మాట ఉంది. ఇప్పటిదాకా చూస్తే ఒకే ఇంట్లో కాపు నేస్తం తీసుకున్న వారే టైలర్ ఉంటే పదివేలు పుచ్చుకున్నారు. డ్రైవర్ అయితే పదివేలు తీసుకున్నారు. ఇందులో కూడా బినామీలే ఎక్కువ. దాంతో మొత్తానికి మొత్తం సంక్షేమ పధకాలను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయించిందిట. ఎటూ లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. తిరుపతి ఉప ఎన్నిక తరువాత దీని మీద సీరియస్ గా కూర్చుని న్యాయమైన వారికే సంక్షేమం అందించాలని జగన్ సర్కార్ వారి ఆలోచనగా ఉందని అంటున్నారు. మరి దీని మీద వ్యతిరేకత వస్తుందా, విపక్షాలకు ఇదే ఆయుధం అవుతుందా అంటే వేచి చూడాల్సిందే.

Related Posts