YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అధికార పార్టీలో 3 గ్రూపులు..6 గొడవలు

అధికార పార్టీలో 3 గ్రూపులు..6 గొడవలు

మెదక్, మార్చి  27, 
అధికారపార్టీలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోందా? అసంతృప్త నేతలు బుస కొడుతున్నారా? ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం వ్యూహాత్మకమేనా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? మెదక్‌ జిల్లా నర్సాపూర్‌. ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో మూడు గ్రూపులు.. ఆరు గొడవలుగా రాజకీయం ఉంది. ఈయన మదన్‌రెడ్డి. నర్సాపూర్‌ ఎమ్మెల్యే. ఈమె సునీతా లక్ష్మారెడ్డి. తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌. ఇక ఈయన మురళీ యాదవ్‌. నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌. ముగ్గురూ కాకలు తీరిన రాజకీయ యోధులే. కాకపోతే పదవులను అందిపుచ్చుకునే రేస్‌లో కొందరు ముందు పరుగెడుతున్నారు.. ఇంకొందరు వెనకబడ్డారు. ఈ పదవుల పంచాయితీనే ఇప్పుడు నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌కు బీజం వేసిందని టాక్‌. గతంలో వైరిపక్షాలుగా పోరాడిన సునీతా లక్ష్మారెడ్డి, మదన్‌రెడ్డిలు ఇప్పుడు ఒకేగూటిలో ఉండటమే కాదు.. పదవులు పట్టేశారు. అయినా ఎవరి వర్గం వారిదే. మురళీయాదవ్‌ గతంలో టీడీపీలో ఉన్నా.. కేసీఆర్‌తో కలిసి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బయటకొచ్చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కారులోనే ప్రయాణిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేసినా.. పదవులు పలకరించలేదు. కళ్లముందే ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కావడంతో మురళీ యాదవ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారట. తన వర్గాన్ని మెయింటైన్‌ చేస్తూ ప్రభుత్వ, టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మున్సిపల్‌ సమావేశాలతోపాటు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల టాక్‌.కౌన్సిలర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన వైపునకు తిప్పుకొంటున్నారన్న ప్రచారం మురళీయాదవ్‌తో రుసరుసలాడుతున్నారట. మున్సిపాలిటీలో ఏం జరిగినా తనకు తెలియాలని అధికారులను ఆదేశించారట ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో తనకే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారనే ఆశలో సర్దుకుపోతున్నా.. స్వపక్షీయులు పైకి నవ్వుతూ పలకరిస్తూ వెనక గోతులు తవ్వుతున్నారని మురళీ వర్గం అనుమానిస్తోందట. దీనికితోడు నియోజకవర్గంలో పట్టుకోసం పదవుల్లో ఉన్నవారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయం అనుకుందో ఏమో.. మురళీయాదవ్‌పై బీజేపీ నేతలు ఫోకస్‌ పెట్టారట. కాషాయ కండువా కప్పుకొంటే నియోజకవర్గ ఇంఛార్జ్‌ పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారట. పక్కనే ఉన్న దుబ్బాకను గెలిచాం చూశారు కదా.. వచ్చే ఎన్నికల్లో మీరే అని చెబుతున్నట్టు సమాచారం. మరి.. నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ను గాడిలో పెట్టేందుకు పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.

Related Posts