YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరంగల్ లో డివిజన్లు రాజకీయం

వరంగల్ లో  డివిజన్లు రాజకీయం

వరంగల్, మార్చి 27, 
ఎన్నికలకు సిద్ధమవుతున్న గ్రేటర్‌ వరంగల్‌లో డివిజన్ల పునర్విభజన దుమారం రేపుతోందా? రాజకీయ ఒత్తిళ్ల మేరకు మార్పులు చేర్పులు చేశారన్న ఆరోపణల్లో నిజమెంత? అభ్యంతరాల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ముసాయిదా విడుదలకు ముందు ఏం జరిగింది? గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కసరత్తులో భాగంగా డివిజన్ల పునర్‌విభజన ముసాయిదా విడుదలైంది. 58 ఉన్న డివిజన్లు 66కు పెరుగుతున్నాయి. డివిజన్ల పెంపు వరకు బాగానే ఉన్నా.. ముసాయిదా విడుదలతో పార్టీలు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యాయి. అందరి అంచనాలు పటాపంచలు కావడంతో మాజీ కార్పొరేటర్లు.. టికెట్‌ ఆశిస్తున్నవారు.. పార్టీల నాయకులు కంగుతిన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముసాయిదా రూపకల్పన సమయంలోనే పెద్ద హైడ్రామా నడిచినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఓరుగల్లు చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డీలిమిటేషన్‌లో రాజకీయ జోక్యం పెరిగిందట. అధికారపక్ష నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకానొక దశలో అధికారులు సైతం ఇరకాటంలో పడినట్టు టాక్‌. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన అధికారులు ఆగమేఘాలపై హైదరాబాద్‌ వెళ్లి.. అక్కడ రాజకీయ నేతలను కలిసిన తర్వాత.. వారి సూచనల మేరకు ముసాయిదాలో మార్పులు చేశారనే చర్చ జోరందుకుంది. సోమవారం సాయంత్రానికి ముసాయిదా పూర్తికావడంతో మంగళవారం ఉదయం రిలీజ్‌ చేద్దామని అనుకున్నారట. కానీ.. మాజీ కార్పొరేటర్లు కొంత కూపీ లాగి.. పార్టీ నేతలకు సమాచారం చేరవేశారట. అప్పటి నుంచి కథ అనేక మలుపులు తిరిగిందని టాక్‌. మంగళవారం సాయంత్రం వరకు ముసాయిదాలో అనేక మార్పులు జరిగినట్టు సమాచారం. ఇన్నాళ్లూ తోకజాడించిన కార్పొరేటర్లకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా డివిజన్లు పునర్విభజన జరిగిందట. అలాగే తమకు అనుకూలంగా ఉన్నవారిని కార్పొరేటర్లగా గెలిపించుకునేలా మార్పులు సూచించారట. ఎట్టకేలకు మంగళవారం రాత్రి ముసాయిదా విడుదల కావడంతో మార్పులపైనే అన్ని వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లడించానికి ఈ నెల 23 వరకు సమయం ఇచ్చారు. దీంతో పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు నాయకులు కసరత్తు మొదలుపెట్టారట. విపక్ష పార్టీలు సైతం అస్త్రశస్త్రాలను, అభ్యంతరాలను పెద్ద ఎత్తున సమర్పించడానికి కుస్తీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అధికారులు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోతే కోర్టు తలుపు తడతామనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. డివిజన్ల పునర్విభజన కసరత్తు కొలిక్కి వస్తే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌  కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థుల ఎంపిక.. ప్రచారం కోసం ఇప్పటి నుంచే నేతలు ఒక ప్లాన్‌ వేసుకుని ఉన్నారు. కానీ.. ముసాయిదా దగ్గరే ఓరుగల్లు రాజకీయం హీటెక్కుతోంది.  మరి.. 23 తర్వాత వరంగల్‌ పాలిటిక్స్‌ ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.

Related Posts