YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వెలగపూడికి షాకే

వెలగపూడికి షాకే

విశాఖపట్టణం, మార్చి 30, 
విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో భారీ రాజకీయ మార్పు వచ్చేసింది. ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన నాటి నుంచి టీడీపీకి కంచుకోటగానే మారిపోయింది. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మూడు సార్లు వెలగపూడి రామకృష్ణబాబు గెలిచారు. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే 2014 లో అయితే ఏపీలో అత్యధిక రెండవ మెజారిటీ సాధించిన నేతగా నిలిచారు. దటీజ్ వెలగపూడి రామకృష్ణ పవర్ అని అంతా చెప్పుకునేలా తూర్పును పసుపు కోటగా మార్చేశారు. కానీ కాలం ఎపుడూ ఒక్కలా ఉండదు కదా. అందుకే ఇపుడు అక్కడ పాలిటిక్స్ తిరగబడింది.విశాఖ తూర్పులో వైసీపీకి ఉన్న బలమేంటో మునిసిపల్ ఎన్నికలు తాజాగా తేల్చాయి. ఇక్కడ ఉన్న 13 వార్డులకు గానూ ఏకంగా పది వార్డులను గెలుచుకుని ఫ్యాన్ గిర్రున తిప్పేసింది. ఈ దెబ్బకు సైకిల్ పంక్చర్ కాక తప్పలేదు. ఇంతకీ టీడీపీ ఇక్కడ గెలిచిన వార్డు ఒకే ఒక్కటి కావడం అంటే వెలగపూడి రామకృష్ణ ప్రాభవం వెలవెలపోయినట్లుగానే చూడాలి అంటున్నారు. ఇక్కడ జనసేన ఒకటి, ఇండిపెండెంట్ కూడా ఒకటి గెలుచుకున్నారు అంటే వారి పక్కనే టీడీపీని కూర్చోబెట్టిన ఘనత మాత్రం అచ్చంగా వైసీపీదే అంటున్నారు.విశాఖ తూర్పులో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు పట్టు ఉంది. దానికి తోడు అన్నట్లుగా తూర్పు వైసీపీ ఇంచార్జి, 2019 ఎన్నికల్లో పోటీ చేసి వెలగపూడి రామకృష్ణ మెజారిటీని సగానికి తగ్గించిన భీమిలీ మునిసిపాలిటీ మాజీ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల కూడా కలసి పనిచేశారు. ఇలా ఇద్దరు బలమైన నాయకులు, యాదవ సామాజికవర్గం అంతా వెలగపూడి రామకృష్ణ మీద ఒక్కసారిగా దండెత్తినట్లుగా పనిచేసింది. ఈ దెబ్బకు ఆయన పార్టీ చిత్తు అయిందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో అక్రమాని విజయనిర్మలకు వంశీ వర్గం వెన్నుపోటు పొడిచింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈసారి అంతా ఒక్కటి కావడంటో టీడీపీని గట్టిగా ఢీ కొట్టారని అంటున్నారు.ఇక వెలగపూడి రామకృష్ణ మీద పగ పట్టేసినట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే టార్గెట్ చేశారు. వెలగపూడి రామకృష్ణ మీద పదే పదే వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయి అంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు కూడా జనాల్లోకి ఈసారి బాగా వెళ్ళాయని అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందే వెలగపూడి అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఆయన్ని చాలెంజ్ చేసి మరీ రాజకీయ రచ్చకు తెర తీయడం కూడా బాగా ఉపకరించింది అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీకి పట్టున్న వార్డులన్నీ కూడా ఈసారి వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. ఇదే ఊపు కొనసాగితే మాత్రం 2024 ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే కావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి తూర్పులో మార్పు తధ్యమని వైసీపీ గట్టిగానే చెప్పేసింది.

Related Posts