YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అయ్యా పెట్టడు.. అడుక్కు తిననీయడు.. దొర నిర్ణయాలు అన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నాయి.. సిఎం కేసిఆర్ పై షర్మిల విసుర్లు

అయ్యా పెట్టడు.. అడుక్కు తిననీయడు.. దొర నిర్ణయాలు అన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నాయి..   సిఎం కేసిఆర్ పై షర్మిల విసుర్లు

హైదరాబాద్ మే 12
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడం.. మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండడంతో.. వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్విటర్ వేదిక ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అయ్యా పెట్టడు.. అడుక్కు తిననీయడు.. అన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.
‘‘కరోనాను కేసీఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరడు.. దొర నిర్ణయాలు అన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నవి. హైదరాబాద్ చుట్టూ నాలుగు దిక్కులా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ ఇచ్చేది లేదు. ఉస్మానియా గాంధీ టిమ్స్ నిమ్స్ లకే ఊపిరి సక్కగా అందట్లేదు. ఇక అందులో చేరిన వారికి వైద్యం గాలిలో దీపంమే. కేసీఆర్ సారూ.. సోయిలోకి రా. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు’’ అని విమర్శించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. కొవిడ్ వైరస్ కారణంగా ప్రజలు ఆగమైపోతున్నారని ఆసుపత్రులకు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు కట్టనిదే ఆసుపత్రులు శవాన్ని కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి మారాలంటే.. కొవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

Related Posts