YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొత్త నేతలకు అవకాశం ఇస్తేనే మనుగడ

కొత్త నేతలకు అవకాశం ఇస్తేనే మనుగడ

కొత్త నేతలకు అవకాశం ఇస్తేనే మనుగడ
(విశ్లేషణ)
ఇదివరకు కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమంటే క్యాబినెట్ కంటే హడావిడి ఉండేది. సీడబ్ల్యూసీలో సభ్యత్వమంటే ముఖ్యమంత్రి హోదాకంటే ఘనతగా భావించేవారు అది గత వైభవం. ఇప్పుడు అసలు వర్కింగ్ కమిటీ సభ్యులెవరో కూడా పార్టీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా తాజా పరాజయాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. షరా మామూలే వరస అపజయాలపై అగ్రనాయకురాలైన సోనియా గాంధీ అసంతృప్తి వెలిబుచ్చారు. పార్టీ నాయకుల నుంచి నివేదిక కోరారు. పార్టీ వ్యవహారాలు ఎంత రొటీన్ గా మారిపోయాయనేందుకు ఇదొక ఉదాహరణ. నివేదికతో మమ అనిపించేస్తారన్నమాట. వర్కింగ్ కమిటీ కార్యాచరణ ఏమిటనేది మాట మాత్రంగానూ ప్రకటించలేదు. రాష్ట్రాల వారీ నాయకత్వ మార్పులకు, నూతన నాయకత్వాన్ని నెలకొల్పుకునేందుకు, మొత్తంగా పార్టీ ప్రక్షాళనకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదో తూతూ మంత్రంగా , మొక్కుబడిగా నివేదిక కోరి సరిపెట్టేశారు. గతంలో పరాజయాలపై కూడా ఇదే తరహా నివేదికలను అధిష్ఠానం తెప్పించుకుంది. ఏమేరకు చర్యలు తీసుకున్నారంటే సమాధానం దొరకదు.కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. 135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెసు అక్కడక్కడ నామమాత్రంగా మిణుకు మిణుకు మంటోంది. చేసిన తప్పేమిటో పార్టీలోని అగ్రనాయకులకు అంతుపట్టడం లేదు. నిజానికి మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. 2008 లో అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభాన్ని సైతం తట్టుకోగలిగింది. అయినా ప్రజలు తిరస్కరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు ఇందుకు కారణం కానేకాదు. చిదంబరం మొదలు అగ్రనాయకులంతా విజృంభించి అక్రమాలకు, అవినీతికి తెర లెత్తేశారు. ఇక మిత్రపక్షాల సంగతి సరేసరి. అవినీతి రాజాలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చర్యలు తీసుకోవడంలో సోనియా ఉదాసీనంగా వ్యవహరించారు. మన్మోహన్ మాట్టాడలేకపోయారు. ప్రతిపక్ష బీజేపీ దానిని సరైన రీతిలో వినియోగించుకుని అధికారంలోకి వచ్చి కూర్చుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కాలం పార్టీ పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తీరా ఇప్పుడు కొంత చొరవ చూపుతున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది.నిజమైన ప్రజాస్వామ్యం నిలవాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా బీజేపీ పలు రాష్ట్రాల్లో నెగ్గుకొస్తోంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు విఫలమవుతోంది. తాజాగా సాగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలిచేందుకు బలమున్నా చేజార్చుకుంది. పుదుచ్చేరిలో నిన్నామొన్నటి వరకూ అధికారంలో ఉంది. సంప్రదాయకంగా కేరళలో ఈసారి కాంగ్రెసు నేతృత్వంలోని యూడీఎఫ్ గెలవాలి. అలాగే అసోంలో బలమైన కూటమి కట్టడం ద్వారా గెలిచేందుకు అవకాశముందని అంచనా వేశారు. అన్ని చోట్లా ఫెయిల్ అయ్యింది . పైపెచ్చు పెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లో ప్రతిపక్ష స్థానం నుంచి ఊడ్చి పెట్టుకుపోయింది. తమిళనాట డీఎంకేకు తోకగా కొనసాగడమే తప్ప సొంత బలం కాదది. భావి వారసులు అయిన రాహుల్ , ప్రియాంకలు ఈ దఫా ఎన్నికల్లో గట్టిగానే పనిచేశారు. గెలుపు అవకాశాలున్న కేరళ, అసోం ల బాధ్యతలను ఇద్దరూ పంచుకున్నారు. ఆ రెండు రాష్ట్రాలపైన బీజేపీ అగ్రనాయకత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. అసోం బీజేపీ గెలుపునకు స్థానిక నాయకత్వమే కారణం. కేరళ లో పెద్ద స్కోరు రాదని బీజేపీకి తెలుసు . అందుకే దానిని కూడా వదిలేసింది. కమలం అగ్రనాయకులందరూ పశ్చిమబెంగాల్ పైనే ఫోకస్ పెట్టారు. ఇది కాంగ్రెసు పార్టీకి మంచి చాన్సు . అయినా కేరళ, అసోం లలో సానుకూల ఫలితాలు తెచ్చుకోలేకపోయింది.ఓడిపోయిన ప్రతిసారీ నివేదికలు తెప్పించుకుంటే సరిపోదు. గతంలో వచ్చిన నివేదికలపై చర్యలు తీసుకుని ఉంటే పార్టీ శ్రేణులు, నాయకులు క్రమశిక్షణతో ఉంటారు. అందులోనూ జనరేషన్ ఛేంజ్ పార్టీలో కనిపించడం లేదు. బీజేపీలో ఇప్పటికే రెండో తరం నాయకత్వం రాష్ట్రాల్లో వచ్చేసింది. యడియూరప్ప వంటి ఒకరిద్దరు తప్ప మొత్తంగా రాష్ట్రాల నాయకత్వంలో మార్పు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలోనూ పెద్దలందర్నీ పక్కన పెట్టేశారు. రాజ్ నాథ్ సింగ్ వంటి వారు లాంఛనంగా మిగిలిపోయారు. కాంగ్రెసు మాత్రం ఈ తరహా ప్రయోగాలు చేయలేకపోతోంది. పాత తరం పెద్దలు పార్టీ పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. రాష్ట్రాల్లో యువతకు అవకాశం ఇవ్వడం లేదు. ఒకవేళ బీజేపీ తప్పుల కారణంగా ఆ పార్టీ ఓడిపోయి, కాంగ్రెసు అధికారంలోకి వస్తే మళ్లీ పదవులు తామే అనుభవించాలని వృద్ధ నాయకులు కలలు కంటున్నారు. ఫలితంగా కాంగ్రెసు ఎప్పటికీ అధికారంలోకి రాలేని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ నాయకుల అక్రమాలు, అవినీతి ప్రజలకు తెలుసు. కాబట్టి వీరికంటే బీజేపీయే నయమనుకుంటున్నారు. నిజంగానే పార్టీ బాగుపడాలి. సరిదిద్దుకోవాలనుకుంటే రాష్ట్రాల నాయకత్వ ప్రక్షాళన జరగాలి. దానికి నివేదికలు అవసరం లేదు. ప్రజలిస్తున్న తీర్పులు సరిపోతాయి.

Related Posts